ODI World Cup 2027 : 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఖాయం.. క్లారిటీ ఇచ్చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్

ODI World Cup 2027 : 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలపై వస్తున్న ఊహాగానాలకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్లారిటీ ఇచ్చాడు. భవిష్యత్ ప్రణాళికల్లో ఇద్దరూ కీలక భాగమని వెల్లడిస్తూ భారత అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు.

ODI World Cup 2027 : 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఖాయం.. క్లారిటీ ఇచ్చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్
Odi World Cup 2027

Updated on: Jul 13, 2026 | 6:05 PM

ODI World Cup 2027 : భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకే తెరపడింది. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు సీనియర్ స్టార్లు ఆడతారా లేదా అనే సస్పెన్స్‌కు భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముగింపు పలికారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 14న జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడారు. ఈ సందర్భంగా 2027లో సౌతాఫ్రికా, జింబాబ్వే దేశాల ఆతిథ్యంలో జరగబోయే మెగా వరల్డ్ కప్‌లో రోహిత్, విరాట్ ఇద్దరూ ఖచ్చితంగా భాగం కాబోతున్నారనే విషయాన్ని ఆయన పరోక్షంగా ధృవీకరించారు.

ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శుభ్‌మన్ గిల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. రాబోయే పెద్ద టోర్నమెంట్ల కోసం టీమ్ కాంబినేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే అంశంపై ఒక రోజు ముందే తాను విరాట్ కోహ్లీతో సుదీర్ఘంగా చర్చించినట్లు గిల్ చెప్పారు. భవిష్యత్తు వన్డే సిరీస్‌లతో పాటు మెగా టోర్నీకి ఏయే ఆటగాళ్లు సరిగ్గా సరిపోతారు, జట్టును ఎలా బలోపేతం చేయాలనే దానిపై ఇద్దరి మధ్య కీలకమైన ప్లానింగ్ నడిచిందని గిల్ పేర్కొన్నారు. కెప్టెన్‌గా ఉన్న గిల్, జట్టులోని సీనియర్ మోస్ట్ ప్లేయర్ అయిన కోహ్లీతో కలిసి వ్యూహాలు రచించడం చూస్తుంటే భవిష్యత్తు టోర్నీలలో వారి ప్రాధాన్యత ఎంత ఉందో అర్థమవుతోంది.

టీమిండియా వన్డే ప్లాన్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాలపై వస్తున్న రూమర్లను గిల్ పూర్తిగా కొట్టిపారేశారు. ఈ వెటరన్ ద్వయం గురించి గిల్ మాట్లాడుతూ.. “గత దశాబ్ద కాలంగా భారత క్రికెట్‌కు రోహిత్, విరాట్ లే వెన్నుముకగా నిలిచారు. జట్టు సాధించిన ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో వారి పాత్ర అమోఘం. ప్రస్తుతం మరియు భవిష్యత్తులో కూడా వారిద్దరూ టీమిండియాలో అత్యంత కీలకమైన విడదీయరాని భాగాలుగానే కొనసాగుతారు” అని స్పష్టం చేశారు. కెప్టెన్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో 2027 వరల్డ్ కప్ వరకు రోహిత్, కోహ్లీల స్థానాలకు ఎలాంటి ఢోకా లేదని తేలిపోవడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us