AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India T20 : భీభత్సమైన ఫామ్‌లో ఉన్నా తోపు ప్లేయర్‎కు టీ20 టీంలో నో ప్లేస్.. అసలు కారణం ఇదే

Team India T20 : ఐపీఎల్ 2026లో 732 పరుగులతో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్‌కు టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళిక, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా బీసీసీఐ అతడిని టీ20లకు దూరంగా ఉంచినట్లు సమాచారం.

Team India T20 : భీభత్సమైన ఫామ్‌లో ఉన్నా తోపు ప్లేయర్‎కు టీ20 టీంలో నో ప్లేస్.. అసలు కారణం ఇదే
Shubman Gill
Rakesh
|

Updated on: Jun 07, 2026 | 3:45 PM

Share

Team India T20 : బీసీసీఐ శనివారం ప్రకటించిన టీ20 జట్లలో స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పేరు లేకపోవడం సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు రాబోయే ఏషియన్ గేమ్స్ కోసం ప్రకటించిన ఏ ఒక్క స్క్వాడ్‌లోనూ గిల్‌కు చోటు దక్కలేదు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించినప్పటికీ, గిల్‌ను పక్కన పెట్టడంపై క్రీడా విశ్లేషకులు, అభిమానులు సెలెక్టర్ల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అయితే గిల్‌ను ఎంపిక చేయకపోవడం వెనుక పెద్ద కారణమే ఉందని తాజాగా స్పష్టమైంది. వాస్తవానికి ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే, 16 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 732 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాదు, అతని కెప్టెన్సీలోనే జట్టు రన్నరప్‌గా ఫైనల్ చేరింది. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కంటే గిల్ కేవలం 44 పరుగులు మాత్రమే వెనుకబడ్డాడు. ఈ సీజన్లో కొత్తగా వచ్చిన వైభవ్‌కు జాతీయ జట్టులో తొలిసారి స్థానం కల్పించిన బోర్డు, గిల్‌ను మాత్రం పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదే

భారీ ఫామ్‌లో ఉన్నా గిల్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదనే ప్రశ్నలపై సెలెక్షన్ కమిటీకి చెందిన ఒక అధికారి ఒకరు మీడియాకు అసలు కారణాన్ని వెల్లడించారు. 2027 లో జరగబోయే వన్డే ప్రపంచ కప్‎ను దృష్టిలో ఉంచుకునే గిల్‌ను టీ20లకు దూరం పెట్టినట్లు సదరు ప్రతినిధి తెలిపారు. రాబోయే కీలకమైన టోర్నమెంట్ల కోసం గిల్ పూర్తిగా ఫిట్‌గా ఉండాలని బోర్డు భావిస్తోంది. ఇందుకోసం అతడిని కేవలం టెస్టులు, వన్డే క్రికెట్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ స్పష్టంగా ఆదేశించినట్లు సమాచారం.

బిజీ షెడ్యూల్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్

భారత క్రికెట్ జట్టుకు రాబోయే 18 నెలల కాలం అత్యంత బిజీ షెడ్యూల్‌తో కూడుకున్నది. గిల్ గనుక మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) నిరంతరాయంగా ఆడితే అది విపరీతమైన అలసటకు దారితీస్తుందని, అలాగే గాయాల బారిన పడే అవకాశం ఉందని బోర్డు ఆందోళన చెందుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత్ మొత్తం 35 వన్డేలు, 9 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందుకే గిల్‌ను ప్రస్తుతానికి టీ20ల నుంచి విశ్రాంతి మోడ్‌లో ఉంచారు. అయితే 2028 ఒలింపిక్స్, ఆ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ సమయానికి అతను మళ్లీ పొట్టి ఫార్మాట్‌లోకి పునరాగమనం చేసే అవకాశం ఉంది.

శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు

గిల్ ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 126 పరుగులతో అద్భుత సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రకటించిన టీ20 జట్టులో హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్‌ను మూడు జట్ల నుంచి డ్రాప్ చేయడం మరో విశేషం. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేయగా, యువ బ్యాటర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఐపీఎల్‌లో రాణించిన యువ ప్లేయర్లకు ఈ టూర్లలో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us