
IND vs WI Test : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే, ఇదే మ్యాచ్‌లో ఒక చిన్న ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వెస్టిండీస్ వికెట్ కీపర్‌తో బలంగా ఢీకొట్టాడు. మైదానంలో అందరూ కంగారు పడుతుంటే, జైస్వాల్ మాత్రం వెంటనే డాక్టర్ పాత్ర పోషించి తన కెప్టెన్‌ను సరదాగా పలకరించాడు.
ఢిల్లీ టెస్టు తొలి రోజు ఆటలో టీమ్ ఇండియా బ్యాటింగ్ అదరగొట్టింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ (173*) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ సందర్భంగా జైస్వాల్, సాయి సుదర్శన్ (87) తో కలిసి దాదాపు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోజు ఆట చివరి గంటలో శుభ్‌మన్ గిల్ (20)* క్రీజులోకి వచ్చాడు. 85వ ఓవర్‌లో, జైస్వాల్ లెగ్ సైడ్‌కు బంతిని కొట్టి ఒక పరుగు కోసం పరిగెత్తాడు. ఆ సమయంలో రెండో పరుగు పూర్తి చేసుకున్న గిల్, అదే వేగంతో వచ్చిన వెస్టిండీస్ వికెట్ కీపర్ టావిన్ ఇమలాచ్ను బలంగా ఢీకొట్టాడు.
ఈ ఢీకొన్న సంఘటన చూసి మైదానంలో ఉన్నవారితో పాటు, కామెంటేటర్లు, అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గిల్ హెల్మెట్ పెట్టుకుని ఉండగా, అతని తల నేరుగా కీపర్ ఛాతీకి తగలడంతో ఇద్దరూ కిందపడిపోయారు. వెంటనే ఇరు జట్ల మెడికల్ సిబ్బంది మైదానంలోకి చేరుకున్నారు. వికెట్ కీపర్ ఇమలాచ్ ఛాతీ నొప్పిగా ఉందని మైదానంలో పడుకుని ఉండగా, శుభ్‌మన్ గిల్ తన హెల్మెట్ తీసి తల పట్టుకుని కూర్చున్నాడు. కొంతసేపు ఆట నిలిచిపోయింది.
blud was asking shubman "kitni ungliyan hai"😭🙏🏻 pic.twitter.com/7cZShwxRiU
— phool (@Gillinationnn) October 10, 2025
మెడికల్ సిబ్బంది గిల్‌ను పరీక్షించిన తర్వాత, స్నేహితుడు, సహచర ఆటగాడైన యశస్వి జైస్వాల్ సరదాగా డాక్టర్ పాత్ర పోషించాడు. సాధారణంగా క్రికెట్‌లో తలకు దెబ్బ తగిలినప్పుడు కంకషన్ జరిగిందేమోనని తెలుసుకోవడానికి ప్రాథమిక పరీక్ష చేస్తారు. అంటే, ఆటగాడికి స్పృహ ఉందో లేదో, అతను సరిగ్గా చూడగలుగుతున్నాడో లేదో తెలుసుకోవడానికి అతని కళ్ల ముందు చేతిని అడ్డం పెట్టి ఎన్ని వేళ్లు చెప్పు అంటూ సరదాగా అడుగుతారు. జైస్వాల్ సరదా ప్రయత్నానికి నొప్పిలో ఉన్న గిల్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. అదృష్టవశాత్తూ, ఇద్దరు ఆటగాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఫిట్‌గా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆట తిరిగి ప్రారంభమైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..