
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే ఐసీసీ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియాలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉండటం వల్ల వ్యూహాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బోర్డు భావిస్తోంది. అందుకే వైట్ బాల్ క్రికెట్(T20I, వన్డే) మొత్తానికి ఒకే కెప్టెన్ ఉండాలని బిసిసిఐ వర్గాలు నిర్ణయించినట్లు సమాచారం.
ఈ బాధ్యతలను స్వీకరించడానికి శ్రేయస్ అయ్యర్ అత్యంత అర్హుడని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అతడు జట్టును నడిపిస్తున్న తీరు, సంక్లిష్ట పరిస్థితుల్లో తీసుకుంటున్న నిర్ణయాలు బిసిసిఐ సెలెక్టర్లను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే గత కొంతకాలంగా గాయాల నుంచి కోలుకుని స్థిరమైన ప్రదర్శన చేస్తున్న అయ్యర్‌కు ఇది ఒక రివార్డ్ అని చెప్పవచ్చు.
రోహిత్ శర్మ తర్వాత జట్టును సమర్థవంతంగా నడిపించగల నాయకత్వ లక్షణాలు అయ్యర్‌లో పుష్కలంగా ఉన్నాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒకే కెప్టెన్ ఉండటం వల్ల ఆటగాళ్ల ఎంపిక, జట్టు వ్యూహాల్లో స్పష్టత ఉంటుందని బిసిసిఐ యోచిస్తోంది. రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన లేదా ఆ తర్వాత జరిగే సిరీస్‌ల నాటికి ఈ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అటు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ వరుసగా మూడో ఓటమిని చవి చూసింది. ఈ తరుణంలో అశ్విన్ కీలక కామెంట్స్ చేశాడు. పంజాబ్ కింగ్స్ తమ బ్యాటింగ్ ఆర్డర్‌తో ఇప్పుడే ప్రయోగాలు చేయవద్దని అశ్విన్ సూచించాడు. “ప్రియాన్ష్ ఆర్య షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు, కానీ అంత మాత్రాన అతన్ని పక్కన పెట్టడం లేదా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం సరైన నిర్ణయం కాదు” అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు. ప్రియాన్ష్ క్రీజులో మరీ నిశ్చలంగా ఉండటం వల్లే ప్యాట్ కమిన్స్ వంటి బౌలర్లు వేగం, బౌన్స్‌తో అతన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పాడు.