Virat Kohli: టీ20తోపాటు వన్డే, టెస్టు కెప్టెన్సీని కూడా కోహ్లీ వదులుకోవాలా?.. వీరేంద్ర సెహ్వాగ్‌ ఏమన్నాడంటే..!

T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ ముందుగానే నిష్క్రమించిన తర్వాత, మిగతా రెండు ఫార్మాట్లలో కూడా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. అయితే, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం..

Virat Kohli: టీ20తోపాటు వన్డే, టెస్టు కెప్టెన్సీని కూడా కోహ్లీ వదులుకోవాలా?.. వీరేంద్ర సెహ్వాగ్‌ ఏమన్నాడంటే..!
Virender Sehwag
Follow us

|

Updated on: Nov 09, 2021 | 8:54 AM

Virender Sehwag: విరాట్ కోహ్లీ సోమవారం నమీబియాతో కెప్టెన్‌గా తన చివరి T20I ఆడిన విషయం తెలిసిందే. అయితే ఇతర రెండు ఫార్మాట్లలో – టెస్ట్, వన్డేలలో నాయకత్వ పాత్రలో కొనసాగాలా వద్దా అని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. భారత T20I జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పదవీకాలం సోమవారం ముగిసింది. భారత జట్టు T20 ప్రపంచ కప్‌2021లో సూపర్ 12 దశలో నిష్క్రమించింది. పొట్టి ఫార్మాట్‌లో భారత కెప్టెన్‌గా తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు టోర్నీకి ముందే కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, న్యూజిలాండ్‌లతో ఘోర పరాజయాలతో ప్రపంచ కప్‌లో భారత్ తన ప్రయాణాన్ని పేలవంగా ఆరంభించింది. అనంతరం మిగతా రెండు ఫార్మాట్‌లలో కూడా కోహ్లీ కెప్టెన్సీ భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. అయితే, ఈ 33 ఏళ్ల కోహ్లీ కెప్టెన్‌గా అద్భుతంగా టీంను నడిపిస్తున్నాడని, వన్డే, టెస్ట్‌లలో నాయకత్వ పాత్రను వదిలకూడదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

“ఇది విరాట్ సొంత నిర్ణయం. కానీ, కోహ్లీ మిగిలిన రెండు ఫార్మాట్ల కెప్టెన్సీని విడిచిపెడతాడని నేను అనుకోను. కేవలం ఆటగాడిగా ఆడాలనుకుంటే, అది అతని నిర్ణయం. విరాట్ కెప్టెన్సీలో భారత్ బాగా ఆడుతుంది. భాతర్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా పేరుగాంచాడు, కోహ్లీ చాలా తెలివైనవాడు” అని సెహ్వాగ్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నాడు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకోవాలా వద్దా అనే ఓ అభిమాని ప్రశ్నకు సెహ్వాగ్ ఇలా స్పందించాడు.

“కోహ్లీ మంచి ఆటగాడు. దూకుడుగా ఉండే కెప్టెన్. భారత జట్టుకు ముందు నుంచి నాయకత్వం వహిస్తున్నాడు. వన్డేలు, టెస్టులలో కెప్టెన్సీని వదిలివేయడం లేదా వదలకపోవడం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం” అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అయితే, ఐసీసీ టోర్నమెంట్‌లలో జట్టు పేలవ ప్రదర్శనకు మాత్రం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఓపెనర్ నొక్కి చెప్పాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత, భారత్ ఇంతవరకు ఐసీసీ టైటిల్‌ను గెలుచుకోలేదు.

“చెడ్డ దశలో మేం జట్టుకు మద్దతు ఇవ్వాలని నాకు తెలుసు, కానీ చాలా కాలం నుంచి ఏ ప్రధాన ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవలేకపోయాం. దీనిపై భారతదేశం కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ద్వైపాక్షిక సిరీస్‌లు గెలవడమే కాదు.. ప్రపంచ టోర్నీలను నిలకడగా గెలిస్తేనే ప్రజలు మినల్ని గుర్తుంచుకుంటారు’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

కాగా, నవంబర్ 17న న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీం ఇండియా స్వదేశంలో బరిలోకి దిగనుంది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎలాటి ఫలితాలు సాధిస్తారో చూడాలి.

Also Read: India New T20I Captain: భారత టీ20 క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే సమర్థుడు అతడే: కొత్త కెప్టెన్‌పై రవిశాస్త్రి..

Ravi Shastri: పెట్రోల్ పోసి వాహనాలను నడపొచ్చు.. మనుషులను కాదు: బీసీసీఐపై రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు