Senuran Muthusamy : 11 ఏళ్లకే నాన్న దూరం.. అమ్మే కోచ్.. భారత్‌పై సెన్యురన్ ముత్తుసామి అద్భుత సెంచరీ

సౌతాఫ్రికా క్రికెటర్ సెన్యురన్ ముత్తుసామి పేరు బహుశా మన భారతీయ క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు గౌహతిలో భారత్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఆటగాడు చేసిన అద్భుతమైన ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్‌కి చాలా కష్టంగా ఉన్న పిచ్‌పై, ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి మన స్టార్ బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి వారిని ఎదుర్కొని మరీ అద్భుతమైన సెంచరీ సాధించాడు.

Senuran Muthusamy : 11 ఏళ్లకే నాన్న దూరం.. అమ్మే కోచ్.. భారత్‌పై సెన్యురన్ ముత్తుసామి అద్భుత సెంచరీ
Senuran Muthusamy

Updated on: Nov 23, 2025 | 2:02 PM

Senuran Muthusamy : సౌతాఫ్రికా క్రికెటర్ సెన్యురన్ ముత్తుసామి పేరు బహుశా మన భారతీయ క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు గౌహతిలో భారత్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఆటగాడు చేసిన అద్భుతమైన ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్‌కి చాలా కష్టంగా ఉన్న పిచ్‌పై, ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి మన స్టార్ బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి వారిని ఎదుర్కొని మరీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. గెలుపోటములు పక్కన పెడితే, ముత్తుసామి జీవిత ప్రయాణం, ఈ సెంచరీ వెనుక ఉన్న కష్టం, పట్టుదల గురించి తెలుసుకుందాం.

సెన్యురన్ ముత్తుసామి స్వతహాగా భారత సంతతికి చెందినవాడు. అతని పూర్వీకులు తమిళనాడులోని నాగాపట్టణం ప్రాంతం నుంచి సౌతాఫ్రికాకు వలస వెళ్లారు. ముత్తుసామి పుట్టి పెరిగింది మాత్రం డర్బన్‌లోనే. చిన్నప్పుడే క్రికెట్ మైదానానికి అతన్ని తీసుకెళ్లి ప్రోత్సహించింది అతని తండ్రే. కానీ ముత్తుసామికి కేవలం 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించారు. అప్పటి నుంచి ముత్తుసామిని అతని తల్లి వాణి మూడ్లీ ఒంటరిగా పెంచారు. ఆమె తన కొడుకు క్రికెటర్ కావాలనే తండ్రి కలను నెరవేర్చడానికి ఎంతో కష్టపడ్డారు.

ముత్తుసామి తల్లి వాణి కేవలం ఆర్థికంగానే కాకుండా, క్రికెట్ విషయంలోనూ తన కొడుక్కి సాయపడ్డారు. ఆమె ముందుగా క్రికెట్ ఆటను నేర్చుకున్నారు. ఆ తర్వాత తన కొడుకు బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నప్పుడు వాటిని వీడియోలు తీసి, వాటిని చూసి లోపాలను సరిదిద్దేవారు. ఒక ఛాంపియన్ క్రికెటర్‌ను తయారు చేయడంలో ఆమె చేసిన కృషి చాలా గొప్పది. సౌతాఫ్రికా జాతీయ జట్టుకి తన కొడుకు ఆడాలనేది తండ్రి కన్న కల… ముత్తుసామి 2019లో భారత్‌పై విశాఖపట్నంలోనే అరంగేట్రం చేసి ఆ కలను నిజం చేశాడు. మళ్లీ ఇప్పుడు అదే భారత్‌పై తన కెరీర్‌లోనే తొలి టెస్ట్ సెంచరీ సాధించడం ఒక చక్కటి కాకతాళీయం.

ముత్తుసామి సాధించిన ఈ సెంచరీ కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు, ఇది పలు రికార్డులను కూడా సృష్టించింది. గత 15 సంవత్సరాలలో భారత్‌లో, ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాళ్లు కేవలం ఇద్దరే. 2019లో క్వింటన్ డి కాక్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడు ముత్తుసామి.

భారత్‌లో టెస్ట్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో, ఆరేళ్ల తర్వాత సెంచరీ చేసిన తొలి ఆటగాడు ముత్తుసామి. అంతకుముందు 2019లో డీన్ ఎల్గార్ ఈ రికార్డును సాధించారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ – ఈ మూడు ఆసియా దేశాల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించిన కేవలం నాలుగో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ముత్తుసామి. అంతకుముందు టెంబా బావుమా, మార్క్ బౌచర్, గ్రేమ్ స్మిత్ మాత్రమే ఈ ఘనత సాధించారు. మొత్తంగా తండ్రి కలను మోస్తూ, తల్లి ప్రోత్సాహంతో సెన్యురన్ ముత్తుసామి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. అతని స్ఫూర్తిదాయక ప్రయాణం ఎందరికో ఆదర్శం.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..