Sarfaraz Khan : అభిషేక్ శర్మను ఉతికారేసిన సర్ఫరాజ్..6 బంతుల్లో 6 బౌండరీలతో ఊచకోత

Sarfaraz Khan : పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి రాగానే విధ్వంసం మొదలైంది. ఒకవైపు హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 5 బంతుల్లోనే 19 పరుగులు పిండుకున్న సర్ఫరాజ్, ఆ తర్వాత అభిషేక్ శర్మ వేసిన ఓవర్‌ను టార్గెట్ చేశాడు. సాధారణంగా బ్యాటర్‌గా బౌలర్లను భయపెట్టే అభిషేక్ శర్మకు, సర్ఫరాజ్ చుక్కలు చూపించాడు.

Sarfaraz Khan : అభిషేక్ శర్మను ఉతికారేసిన సర్ఫరాజ్..6 బంతుల్లో 6 బౌండరీలతో ఊచకోత
Sarfaraz Khan

Updated on: Jan 08, 2026 | 4:32 PM

Sarfaraz Khan : క్రికెట్ మైదానంలో పరుగుల వర్షం కురిపించడం సర్ఫరాజ్ ఖాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. కానీ, ఈసారి అతను సృష్టించిన విధ్వంసం మామూలుగా లేదు. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఈ ముంబై స్టార్, ప్రత్యర్థి జట్లకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటర్‌గా పేరున్న అభిషేక్ శర్మను బౌలర్‌గా మార్చి, అతని ఓవర్‌లోనే చుక్కలు చూపించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.

పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి రాగానే విధ్వంసం మొదలైంది. ఒకవైపు హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 5 బంతుల్లోనే 19 పరుగులు పిండుకున్న సర్ఫరాజ్, ఆ తర్వాత అభిషేక్ శర్మ వేసిన ఓవర్‌ను టార్గెట్ చేశాడు. సాధారణంగా బ్యాటర్‌గా బౌలర్లను భయపెట్టే అభిషేక్ శర్మకు, సర్ఫరాజ్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్‌లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాది మొత్తం 30 పరుగులు రాబట్టాడు. అంటే వేసిన 6 బంతుల్లోనూ బంతిని బౌండరీ దాటించాడన్నమాట. ఈ దాడితో అభిషేక్ శర్మ బౌలింగ్ విశ్లేషణ పూర్తిగా దెబ్బతింది.

ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ (వన్డే ఫార్మాట్) చరిత్రలో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా రికార్డుల్లోకెక్కింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ 20 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 310గా ఉండటం గమనార్హం. ఒక వన్డే టోర్నమెంట్‌లో టీ20 కంటే వేగంగా ఆడటం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ టోర్నమెంట్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఆపడం ఎవరితరం కావడం లేదు. ఇప్పటివరకు ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో అతను 303 పరుగులు చేశాడు. అతని సగటు 80కి పైగా ఉండగా, స్ట్రైక్ రేట్ 173గా ఉంది. రెడ్ బాల్ క్రికెట్‌లోనే కాకుండా, వైట్ బాల్ క్రికెట్‌లోనూ తానొక భయంకరమైన ఆటగాడినని సెలెక్టర్లకు బలమైన సంకేతాలిచ్చాడు. ముంబై టీమ్ భారీ స్కోర్లు సాధించడంలో సర్ఫరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మరోవైపు పంజాబ్ జట్టులో కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. అభిషేక్ శర్మ బ్యాటర్‌గా కూడా నిరాశపరిచాడు. 10 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. అన్‌మోల్‌ప్రీత్ (57), రమణ్‌దీప్ సింగ్ (72) రాణించడంతో పంజాబ్ 200 పరుగుల మార్కును దాటినప్పటికీ, సర్ఫరాజ్ మెరుపు దాడి ముందు ఆ లక్ష్యం చాలా చిన్నదైపోయింది. ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో ఘనవిజయాన్ని సాధించింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.