Sanju Samson : ఫామ్ కోసం నెట్స్‌లో అగ్నిపరీక్ష..ఆ 30 నిమిషాలు సంజూ శాంసన్ రాత మారుస్తుందా?

Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026కు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. వచ్చే ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు ప్రస్తుతం భీకరమైన ఫామ్‎లో కనిపిస్తోంది.

Sanju Samson : ఫామ్ కోసం నెట్స్‌లో  అగ్నిపరీక్ష..ఆ 30 నిమిషాలు సంజూ శాంసన్  రాత మారుస్తుందా?
Sanju Samson (1)

Updated on: Jan 28, 2026 | 7:01 AM

Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026కు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. వచ్చే ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు ప్రస్తుతం భీకరమైన ఫామ్‎లో కనిపిస్తోంది. అయితే అంతా బాగున్నా ఒకే ఒక్క విషయం ఇప్పుడు మేనేజ్మెంటును కలవరపెడుతోంది. అదే ఓపెనర్ సంజూ శాంసన్ వరుస ఫెయిల్యూర్స్. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో సంజూ ఆటతీరు ఫ్యాన్సును తీవ్రంగా నిరాశపరుస్తోంది. మరి ఈ గండం నుంచి గట్టెక్కేందుకు సంజూ ఏం చేస్తున్నాడు? కోచ్‌లు ఏమంటున్నారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. అభిషేక్ శర్మ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటుంటే, రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. కెప్టెన్ సూర్య కూడా ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసివచ్చే అంశం. కానీ, ఇన్ని సానుకూలతల మధ్య సంజూ శాంసన్ స్కోరు బోర్డు మాత్రం వెలవెలబోతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో కలిపి సంజూ కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి కొన్ని రోజుల ముందు మెయిన్ ఓపెనర్ ఇలా వరుసగా డకౌట్లు కావడం ఆందోళన కలిగించే విషయమే.

సంజూ వరుసగా ఫెయిల్ అవుతున్నా జట్టు యాజమాన్యం మాత్రం అతనికి పూర్తి అండగా నిలుస్తోంది. నాలుగో టీ20కి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బౌలింగ్ కోచ్ మార్నే మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సంజూ తన ఫామ్‌ను, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడానికి కేవలం ఒకే ఒక్క మంచి ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడు. వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో ఆటగాళ్లు సరైన సమయంలో తమ అత్యుత్తమ ప్రదర్శన చేయడం ముఖ్యం. సంజూ నెట్స్‌లో చాలా కష్టపడుతున్నాడు, మంచి షాట్లు ఆడుతున్నాడు. అతనిపై మాకు నమ్మకం ఉంది” అని మోర్కెల్ పేర్కొన్నారు. అంటే వైజాగ్‌లో జరగబోయే నాలుగో మ్యాచ్‌లో కూడా సంజూ ఓపెనర్‌గా బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

జట్టు సపోర్టు ఇస్తున్నా, విమర్శకుల నోళ్లు మూయించాలంటే పరుగులు చేయక తప్పదని సంజూకు కూడా తెలుసు. అందుకే మంగళవారం (జనవరి 27) జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌లో సంజూ ప్రత్యేకంగా పాల్గొన్నాడు. సాధారణంగా ఇలాంటి సెషన్లకు ఆటగాళ్లు రావడం తప్పనిసరి కాదు, కానీ సంజూ మాత్రం గ్రౌండ్‌కు వచ్చి సుమారు 30 నిమిషాల పాటు నెట్స్‌లో చెమటోడ్చాడు. ఈ సమయంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వంటి మేటి స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. మొదట్లో కాస్త తడబడినప్పటికీ, కాసేపటి తర్వాత తన ట్రేడ్ మార్క్ భారీ షాట్లతో నెట్స్‌ను హోరెత్తించాడు. ఈ ప్రాక్టీస్ సెషన్ అతనికి ఎంతవరకు ఉపయోగపడుతుందో బుధవారం నాటి మ్యాచ్‌లో తేలిపోనుంది.

విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఇక్కడ బంతి బ్యాటుకు నేరుగా వస్తుంది కాబట్టి సంజూ లాంటి స్ట్రోక్ ప్లేయర్‌కు ఇది అద్భుతమైన అవకాశం. వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు సంజూనే అని భావిస్తున్న గంభీర్, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే వరుస వైఫల్యాల వల్ల ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపి, సంజూను మిడిల్ ఆర్డర్‌కు మార్చాలన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా సంజూ శాంసన్ తన కెరీర్‌లోనే అత్యంత కీలకమైన దశలో ఉన్నాడు. ఒక్క మెరుపు ఇన్నింగ్స్ ఆడితే వరల్డ్ కప్ రేసులో నిలబడతాడు.. లేదంటే రిజర్వ్ బెంచ్‌కు పరిమితం కావాల్సి వస్తుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..