
Sanju Samson : ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న స్టార్ బ్యాటర్ సంజూ శామ్సన్ తన కెప్టెన్సీ ఆశలపై నోరు విప్పారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి భారీ ధరకు చెన్నైకి మారినప్పటి నుంచి సాగుతున్న ప్రచారానికి ఆయన ముగింపు పలికారు. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం, తన బాధ్యతలపై సంజూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడాలోకంలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ నుంచి రూ.18 కోట్ల భారీ ఒప్పందంతో చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన సంజూ శామ్సన్, జట్టు పగ్గాలు చేపడతారని అందరూ భావించారు. అయితే యాజమాన్యం రుతురాజ్ గైక్వాడ్‌పైనే నమ్మకం ఉంచింది. మే 10న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే కీలక పోరుకు ముందు, అభినవ్ ముకుంద్‌తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంజూ తన మనసులోని మాటను బయటపెట్టారు.
కెప్టెన్సీ ఆశల గురించి సంజూ మాట్లాడుతూ.. “నేను ఒక జట్టును వదిలి మరో కొత్త జట్టులోకి వచ్చినప్పుడు ఎటువంటి డిమాండ్లు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఒక కొత్త ఇంటికి వెళ్లేటప్పుడు మనం గౌరవంగా వెళ్లాలి కానీ, అక్కడ పదవులు కోరకూడదు. నా మొదటి ప్రాధాన్యత జట్టు నమ్మకాన్ని గెలవడం, నా ప్రదర్శనతో జట్టు విజయాల్లో భాగం కావడం మాత్రమే” అని స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, సీఎస్కేలో ఒక ఆటగాడిగా చేరడం తనకు సంతోషాన్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను సంజూ ఆకాశానికెత్తారు. “రుతురాజ్ చాలా ప్రశాంతమైన వ్యక్తి. భారత క్రికెట్‌లో అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న ఆటగాళ్లలో ఆయన ఒకరు. ఒక పెద్ద ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్నా, ఆయనలో ఎటువంటి గర్వం కనిపించదు. నేనే స్వయంగా సంప్రదించి, నన్ను జట్టులోకి ఆహ్వానించిన వ్యక్తి ఆయన. తన సామర్థ్యంపై తనకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టే, మరో సీనియర్ కెప్టెన్‌ను తన జట్టులోకి ఆహ్వానించగలిగారు” అని సంజూ ప్రశంసించారు.
ఈ ఏడాది సంజూ శామ్సన్ బ్యాట్‌తో విశ్వరూపం చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో 57.43 సగటుతో 402 పరుగులు సాధించారు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. విశేషమేమిటంటే సంజూ భారీ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లోనూ చెన్నై ఘనవిజయం సాధించింది. 167.50 స్ట్రైక్ రేట్‌తో ఆయన ఆడుతున్న తీరు ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తోంది.
కెప్టెన్సీ వివాదాలకు స్వస్తి పలికిన సంజూ, ప్రస్తుతం కేవలం తన బ్యాటింగ్‌పైనే దృష్టి సారించారు. ధోనీ వారసత్వాన్ని రుతురాజ్ సమర్థవంతంగా కొనసాగిస్తున్నారని, తాను అతనికి అండగా ఉంటానని సంజూ చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టోర్నీ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ ఇద్దరి సమన్వయం చెన్నైకి ఆరో టైటిల్ అందిస్తుందో లేదో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..