Team India : ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత్ ఘోర పరాజయం.. ఓటమికి గల అసలు కారణాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్

Team India : ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటన ల్లో టీమిండియా వరుస ఓటములకు కోచ్ లేదా కెప్టెన్ కారణం కాదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ఐపీఎల్ బ్యాటింగ్ పిచ్‌లు, సెలెక్షన్ విధానమే అసలు సమస్య అని బీసీసీఐకి సూచించారు.

Team India : ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత్ ఘోర పరాజయం.. ఓటమికి గల అసలు కారణాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్
Ind Vs Eng

Updated on: Jul 13, 2026 | 3:13 PM

Team India : ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత టీ20 క్రికెట్ జట్టు వరుసగా సిరీస్‌లను కోల్పోవడంతో అభిమానులు, మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైఫల్యాలపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ టీమిండియా ఓటములపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐకి ఆయన ఒక కీలక విన్నపం చేశారు. ఓటములు రాగానే త్వరత్వరగా పెద్ద నిర్ణయాలు తీసుకుని కోచ్‌ను, కెప్టెన్‌ను మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, సమస్యకు అసలు కారణాన్ని వెతకాలని స్పష్టం చేశారు.

సంజయ్ మంజ్రేకర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ విషయాలను కూలంకషంగా చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. “ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు అత్యంత సులువైన పని ఏమిటంటే..హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను తొలగించడం, కెప్టెన్‌ను మార్చడం, లేదా ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో సరిగ్గా ఆడని ఆటగాళ్లను జట్టు నుంచి తీసేయడం. ఇలా చేయడం చాలా ఈజీ రూట్. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. అసలు భారత్ ఎందుకు ఘోరంగా విఫలమైందో దానికి గల వాస్తవ కారణాలను గుర్తించడమే ఇప్పుడు బోర్డు చేయాల్సిన సరైన పని. విదేశీ పిచ్‌లపై మన ఆటగాళ్లు తడబడటమే ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణం” అని మంజ్రేకర్ పేర్కొన్నారు.

భారత బ్యాటర్ల వైఫల్యానికి ఐపీఎల్‎లో ఉండే బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌లే కారణమని మంజ్రేకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఐపీఎల్ లోని పిచ్‌లు బ్యాటర్లకు అత్యంత సులభంగా ఉంటాయని, అక్కడ పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన అన్నారు. సెలెక్టర్లు ఐపీఎల్ ప్రదర్శనను ప్రాతిపదికగా తీసుకుని ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేయడం వల్లనే ఈ సమస్య వస్తోందని విశ్లేషించారు. ఐపీఎల్ లో బాగా ఆడినంత మాత్రాన.. బౌలర్లకు స్వింగ్, బౌన్స్ లభించే ఇంగ్లాండ్, ఐర్లాండ్ వంటి విదేశీ పరిస్థితుల్లో వారు రాణిస్తారని అనుకోవడం పొరపాటని, ఐపీఎల్ ప్రదర్శన ఆటగాళ్ల అసలు ప్రతిభను సరిగ్గా అంచనా వేయనివ్వడం లేదని మంజ్రేకర్ స్పష్టం చేశారు.

భారత సెలెక్షన్ కమిటీ ఇకనైనా మేల్కొని మరింత తెలివిగా వ్యవహరించాలని మంజ్రేకర్ సూచించారు. విదేశీ గడ్డపై, బౌలింగ్‌కు అనుకూలించే కఠినమైన పిచ్‌లపై కూడా నిలకడగా ఆడి, టీ20ల్లో జట్టును గెలిపించగల సత్తా ఉన్న ఆటగాళ్లనే ఎంపిక చేయాలని చెప్పారు. ప్రస్తుత జట్టులో శుభ్‌మన్ గిల్ అటువంటి మేటి ఆటగాళ్లలో ఒకరని ఆయన ప్రశంసించారు. అలాగే ఐపీఎల్‌ను కేవలం ఒక వ్యాపారంగా మార్చడం కోసం, కేవలం బ్యాటర్లకే అనుకూలించే పిచ్‌లను తయారు చేయమని సలహాలు ఇచ్చిన వారిపైనే బీసీసీఐ మొదట చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కెప్టెన్ లేదా కోచ్‌లను బలిపశువులను చేయడం వల్ల భారత క్రికెట్ భవిష్యత్తు మారదని మంజ్రేకర్ హితవు పలికారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us