
Sameer Minhas : అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియాను ఓడించి పాకిస్థాన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు సమీర్ మిన్హాస్. కేవలం 113 బంతుల్లో 172 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 484 పరుగులు సాధించి, ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన సమీ అస్లాం (461 పరుగులు) పాత రికార్డును సమీర్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో ఈ కుర్రాడి పేరు మార్మోగిపోతోంది.
మిన్హాస్ అంటే హిందువా? ముస్లిమా? అసలు నిజమేంటి?
సమీర్ మిన్హాస్ అద్భుత ప్రదర్శన తర్వాత, సోషల్ మీడియాలో అతని మతం గురించి పెద్ద చర్చ నడుస్తోంది. అతని ఇంటి పేరు మిన్హాస్ కావడమే దీనికి కారణం. మిన్హాస్ అనేది ఒక రాజ్‌పుత్ వంశానికి చెందిన పేరు. వీరి మూలాలు సూర్యవంశీ రాజ్‌పుత్‌లు, డోగ్రా రాజవంశానికి చెందినవి. మన దేశంలోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో హిందూ, సిక్కు మతాల్లో మిన్హాస్ రాజ్‌పుత్‌లు ఉన్నారు. అయితే, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ముస్లిం మిన్హాస్ రాజ్‌పుత్ కుటుంబాలు నివసిస్తున్నాయి. సమీర్ మిన్హాస్ ముల్తాన్‌లో జన్మించిన ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. కాబట్టి అతను ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నాడు.
క్రికెట్ వారసత్వం.. రక్తంలోనే ఆట
సమీర్ మిన్హాస్ క్రికెట్ కుటుంబం నుండి వచ్చాడు. అతని తండ్రి కాశిఫ్ మిన్హాస్ కూడా గతంలో అండర్-19 స్థాయిలో క్రికెట్ ఆడారు. ఇక సమీర్ అన్నయ్య అరాఫత్ మిన్హాస్ ఇప్పటికే పాకిస్థాన్ సీనియర్ జట్టు తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడిన స్పిన్నర్. తొమ్మిదేళ్ల వయసులోనే బ్యాట్ పట్టిన సమీర్, అండర్-13 నుంచి అండర్-16 వరకు తన సత్తా చాటుతూ ఇప్పుడు దేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. బ్యాటింగ్‌తో పాటు లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగల సామర్థ్యం ఇతని సొంతం.
రికార్డుల వేటలో సమీర్..
అండర్-19 ఆసియా కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (172) నమోదు చేసిన ఆటగాడిగా సమీర్ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో అతని బ్యాటింగ్ సగటు ఏకంగా 157.00గా ఉండటం విశేషం. పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు సూపర్ స్టార్‌గా ఇతడిని అభివర్ణిస్తున్నారు. భారత్ వంటి బలమైన జట్టుపై ఇంతటి ఆధిపత్యం ప్రదర్శించడంతో, త్వరలోనే సమీర్ పాక్ సీనియర్ జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..