Sachin Tendulkar: ఒకప్పుడు జిగిరీ దోస్తులు.. చిరకాల మిత్రుడినే గుర్తుపట్టలేకపోయిన కాంబ్లీ.. అసలు ఏమైంది?

| Edited By: TV9 Telugu

Dec 04, 2024 | 11:16 AM

ప్రముఖ కోచ్ దివంగత రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ఇద్దరు పాత స్నేహితులు ముంబైలో కలుసుకున్నారు. అయితే ఈ సమావేశంలో సచిన్‌ను కాంబ్లీ గుర్తుపట్టకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది

Sachin Tendulkar: ఒకప్పుడు జిగిరీ దోస్తులు.. చిరకాల మిత్రుడినే గుర్తుపట్టలేకపోయిన కాంబ్లీ.. అసలు ఏమైంది?
Sachin Tendulkar Gets Emotional After Seeing The Vinod Kambli
Follow us on

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఆయనను గుర్తించని వారు ఎవ్వరూ ఉండరు.  అయితే సచిన్ తన చిన్ననాటి స్నేహితుడు, టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీని ఓ ఈవెంట్‌లో కలిశాడు. మంగళవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్, వినోద్ కాంబ్లీ కలుసుకున్నారు. సచిన్ కాంబ్లీల చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కోచ్ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. అచ్రేకర్ అత్యంత ప్రసిద్ధ ప్రతిభావంతులైన ఇద్దరు శిష్యులు టెండూల్కర్, కాంబ్లీ.. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. ఇక్కడే వారిద్దరూ కలుసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.  ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు.

ప్రముఖ పాపారాజీ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో సచిన్, కాంబ్లీ ఈ ఈవెంట్ కోసం నిర్మించిన వేదికపై ఒకరినొకరు కలుసుకున్నారు. వేదికపై ఓ భాగంలో కాంబ్లీ కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇంతలో వేదికపైకి చేరుకున్న సచిన్ నేరుగా తన పాత స్నేహితుడి వద్దకు వెళ్లాడు. కాంబ్లీ తన స్నేహితుడిని గుర్తించలేకపోయాడా అనే ప్రశ్న తలెత్తడానికి ఇక్కడ ఏదో జరిగింది. నిజానికి సచిన్ రాగానే కాంబ్లీతో కరచాలనం చేసినా కాంబ్లీ ఏ విధంగానూ స్పందించలేదు. అటువంటి పరిస్థితిలో, సచిన్ ఏదో మాట్లాడటం కనిపించింది, ఆ తర్వాత కాంబ్లీ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అతను సచిన్‌తో చాలాసేపు మాట్లాడాడు. తర్వాత సచిన్ మరోవైపు వెళ్లాడు.

కాంబ్లీ, సచిన్‌లను సన్నిహితంగా తెలిసిన బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ కూడా కొన్ని ఆస్తకికరమైన వ్యాఖ్యలు చేశాడు.  కాంబ్లీ మొదట్లో సచిన్‌ను గుర్తించలేకపోయాడని, ఆ తర్వాత సచిన్ తనను తాను పరిచయం చేసుకున్నాడని, కాంబ్లీ వెంటనే అతనిని గుర్తించాడని వివరించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్ రియాక్షన్స్ ఇస్తున్నారు. కాంబ్లీ ఆరోగ్యం బాగా లేదని పలువురు కామెంట్లు పెడుతున్నారు.  కొన్ని నెలల క్రితమే కాంబ్లీ ఆరోగ్యం బాగలేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఓ వీడియో వైరల్ కూడా అప్పట్లో వైరల్ అయ్యింది.