చిరిగిన షూతో బరిలోకి.. 103 మీటర్ల సిక్సర్‌తో సంచలనం.. ఈ చీకటి సూర్యుడి గురించి తెలుసా?

103 Metre Six Ryan Burl: టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వే అద్భుత ప్రదర్శన వెనుక ఓ చీకటి సూర్యుడు ఉన్నాడు. ఆయనే ర్యాన్ బర్ల్. ఐదేళ్ల క్రితం చిరిగిపోయిన క్రికెట్ షూ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టి స్పాన్సర్ కోసం విజ్ఞప్తి చేసిన ఈ ఆటగాడు.. నేడు 103 మీటర్ల భారీ సిక్సర్‌తో ప్రపంచ క్రికెట్ వేదికపై చర్చనీయాంశంగా మారాడు.

చిరిగిన షూతో బరిలోకి.. 103 మీటర్ల సిక్సర్‌తో సంచలనం.. ఈ చీకటి సూర్యుడి గురించి తెలుసా?
103 Metre Six Ryan Burl

Updated on: Feb 21, 2026 | 2:05 PM

Inspirational Cricket Story Ryan Burl: 2021లో తన చిరిగిన షూ ఫోటోను పోస్ట్ చేస్తూ, “జింబాబ్వే క్రికెటర్లు ప్రతి సిరీస్‌లో షూలను కుట్టించుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూడండి” అని బర్ల్ రాసుకొచ్చాడు. ఆ పోస్టు వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఓ స్పోర్ట్స్ సంస్థ అతనికి మద్దతుగా నిలిచింది. ఇప్పుడు వరల్డ్ కప్‌లో అతని బ్యాట్ చెలరేగుతోంది. దీంతో అతని లైఫ్ మొత్తం మారిపోయింది.

కొలంబో ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బర్ల్, శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో 103 మీటర్ల దూరం వెళ్లే సిక్సర్ కొట్టాడు. ఈ టోర్నీలో ఇది మూడో పొడవైన సిక్సర్. అంతకు ముందు భారత్ ఆటగాడు హార్దిక్ పాండ్యా 109 మీటర్ల సిక్సర్ కొట్టాడు. బర్ల్ కొట్టిన ఆ సిక్సర్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. గ్రూప్ ‘బి’లో జింబాబ్వే టాప్‌లో నిలవడంలో ఈ షాట్ కీలక పాత్ర పోషించింది.

ఆ మ్యాచ్‌లో బ్రియాన్ బెన్నెట్ నిలకడైన బ్యాటింగ్, కెప్టెన్ సికందర్ రజా దూకుడు ఇన్నింగ్స్ కూడా ముఖ్యమైనవే. కానీ, హెడ్‌లైన్స్ దక్కించుకున్నది మాత్రం బర్ల్ కొట్టిన ఆ భారీ షాట్. గ్రూప్ స్టేజ్‌లో నంబర్ మూడు స్థానంలో బ్యాటింగ్ చేసిన బర్ల్ 58 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 138.09 కాగా, సగటు 29. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా మూడు మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చూపించాడు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అసలైన మాయ..

బర్ల్ అసలైన ప్రభావం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కనిపించింది. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆస్ట్రేలియా తరపున గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాట్ రెన్‌షా 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ సమయంలో గాయంతో సికందర్ రజా మైదానం విడిచిపెట్టడంతో బౌలింగ్ బాధ్యత బర్ల్‌పై పడింది. ఒకే ఓవర్‌లో మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్‌లను ఔట్ చేసి మ్యాచ్ దిశను పూర్తిగా మార్చేశాడు. ఆ విజయం ఆస్ట్రేలియాను టోర్నీ నుంచి దాదాపుగా బయటకు నెట్టేసింది.

తర్వాత ఐర్లాండ్‌తో వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్‌లో ఒక పాయింట్ సాధించి జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధించింది. శ్రీలంకపై గెలిచి గ్రూప్ టాప్ స్థానం కూడా ఖరారు చేసుకుంది. 2024 వరల్డ్ కప్‌లో ఆడలేకపోయిన జట్టుకు ఇది గొప్ప పునరాగమనంగా నిలిచింది.

ముందు వెస్టిండీస్, భారత్, సౌతాఫ్రికా వంటి బలమైన ప్రత్యర్థులతో పోటీ ఉంది. అయినా పెద్ద వేదికపై ఆశ్చర్యాలు సృష్టించగల సత్తా తమకుందని జింబాబ్వే ఇప్పటికే నిరూపించింది. ఆ స్టోరీలో హీరోగా ర్యాన్ బర్ల్ నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us