
RR Unwanted Record : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక అవాంఛనీయ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 200 పరుగుల మార్కును దాటడంతో, ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో ఏడు సార్లు 200 ప్లస్ పరుగులు ఇచ్చుకున్న జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రెగ్యులర్ కెప్టెన్ అందుబాటులో లేకపోవడంతో యశస్వి జైస్వాల్ కెప్టెన్‌గా వ్యవహరించారు. టాస్ గెలిచిన జైస్వాల్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అయితే ఈ నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ (55), శుభ్‌మన్ గిల్ (84) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. రాజస్థాన్ బౌలర్లను ఉతికేస్తూ నిర్ణీత 20 overs లో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించారు. రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసినప్పటికీ 47 పరుగులు ఇచ్చుకున్నారు. రవీంద్ర జడేజా, యశ్ రాజ్ పుంజా తలో వికెట్ తీశారు.
ఒకే సీజన్‌లో 7 సార్లు 200+ పరుగులు
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇది వరుసగా రెండో ఏడాది ఎదురైన చేదు అనుభవం. 2025 సీజన్‌లో కూడా 14 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ బౌలర్లు 7 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నారు. ఇప్పుడు 2026 సీజన్‌లో కేవలం 11 మ్యాచ్‌లు ఆడేసరికే మళ్ళీ 7 సార్లు ప్రత్యర్థికి 200 పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టూ కూడా రెండు వేర్వేరు సీజన్లలో ఇలా ఏడుసార్లు 200 ప్లస్ పరుగులు ఇచ్చుకోలేదు. 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ కూడా ఏడుసార్లు ఈ ఫీట్ నమోదు చేసినా, రాజస్థాన్ మాత్రం వరుసగా రెండేళ్లు ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఏడాది వారీగా రాజస్థాన్ బౌలింగ్ వైఫల్యాలు
రాజస్థాన్ రాయల్స్ ప్రయాణాన్ని గమనిస్తే, మొదటి సీజన్ (2008)లో కేవలం 3 సార్లు మాత్రమే 200 ప్లస్ పరుగులు ఇచ్చుకున్నారు. 2012 నుంచి 2014 వరకు ఒక్కసారి కూడా 200 పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కానీ, గత రెండు మూడేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2024లో 3 సార్లు ఉంటే, 2025లో అది 7కు చేరింది. ప్రస్తుత 2026 సీజన్ ఇంకా ముగియకముందే అప్పుడే 7 సార్లు భారీ స్కోర్లు ఇచ్చుకోవడం వారి బౌలింగ్ లోపాలను ఎత్తిచూపుతోంది.
ప్రపంచ రికార్డు దిశగా రాజస్థాన్ అడుగులు
టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ పరుగులు ఇచ్చుకున్న జట్టుగా పాకిస్థాన్‌కు చెందిన సౌతర్న్ పంజాబ్ ఉంది. 2020 నేషనల్ టీ20 కప్‌లో ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 8 సార్లు 200 పైగా పరుగులు ఇచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్ 7 సార్లు ఇచ్చి రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో గనుక రాజస్థాన్ బౌలర్లు 200 పరుగులు ఇచ్చుకుంటే, ప్రపంచ రికార్డును సమం చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా నేషనల్ టీం (2023-24), స్లోవేనియా (2025) కూడా ఒకే సీజన్‌లో ఏడు సార్లు 200 ప్లస్ పరుగులు ఇచ్చి ఈ జాబితాలో ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..