IPL 2022: త్వరలో ఐపీఎల్ 2022 ప్రారంభంకానుంది. మొత్తం 10 జట్ల ఆటగాళ్లు సిద్ధమయ్యారు. మార్చి 26 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. కానీ 10 జట్లలో ఇప్పటికీ ఒక టీంకు కెప్టెన్ ఎవరో తెలియదు. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. మూడుసార్లు ఐపీఎల్ ఫైనలిస్ట్ అయిన RCBకి ఈ సీజన్ కెప్టెన్‌ను ప్రకటించలేదు. ఐపీఎల్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2022 వేలం తర్వాత కొత్త కెప్టెన్ పేరుని ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఎవ్వరినీ ప్రకటించలేదు. వేలానికి ముందు విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను ఆర్‌సీబీ రిటైన్ చేసుకుంది. అదే సమయంలో వేలంలో దినేష్ కార్తీక్, ఫాఫ్ డు ప్లెసిస్ రూపంలో సీనియర్ ఆటగాళ్లను తీసుకుంది. వీరిలో మ్యాక్స్‌వెల్, కార్తీక్, డు ప్లెసిస్‌లు కెప్టెన్సీకి పోటీదారులుగా ఉన్నారు. మాక్స్‌వెల్, డు ప్లెసిస్‌లు విదేశీ ఆటగాళ్లు. ఈ కారణం వల్ల దినేష్ కార్తీక్ కెప్టెన్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అతను గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గతంలో ఆర్సీబీ తరఫున కూడా ఆడాడు.
దినేష్ కెప్టెన్సీలో కేకేఆర్ 2018లో ప్లేఆఫ్‌కు చేరింది. అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో అతని కెప్టెన్సీలో తమిళనాడు జట్టు చాలా విజయవంతగా రాణించింది. ఈ కోణంలో దినేష్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కావచ్చని తెలుస్తోంది. డు ప్లెసిస్ కూడా బలమైన పోటీదారుగా ఉన్నాడు. అతను ప్రపంచంలోని అనేక విభిన్న లీగ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. అతను దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా కూడా చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ గురించి మాట్లాడితే అతని ఫామ్ అతనికి మైనస్‌గా మారింది. 2013 నుంచి ఐపీఎల్‌లో భాగమైన అతను ఒకటి, రెండు సీజన్‌లు మినహా పెద్దగా రాణించలేకపోయాడు.