Ross Taylor Retirement: న్యూజిలాండ్ క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. సుమారు 20 ఏళ్ల పాటు జట్టుకు సేవలందించిన స్టార్ ఆటగాడు రాస్ టేలర్ (Ross Taylor)క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. సోమవారం హమిల్టన్ వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన మూడో వన్డే అతనికి చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న రోస్కో ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేసి వాన్ బ్రీక్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. కాగా టేలర్ ఔటవ్వగానే స్టేడియంలోని ప్రేక్షుకులు, ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ అతనికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అంతకుముందు చివరిసారిగా బ్యాటింగ్ ఆడేందుకు మైదానంలోకి వచ్చిన ఈ కివీస్ స్టార్ క్రికెటర్‌కు నెదర్లాండ్ క్రికెటర్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’ తో వెల్కమ్ చెప్పారు. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు టేలర్. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. జాతీయ గీతం ముగిసేదాకా కళ్లను తుడుచుకుంటూనే కనిపించాడు. ఆ సమయంలో టేలర్ సతీమణి, పిల్లలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రెండు దశాబ్దాల అనుబంధం..
కాగా న్యూజిలాండ్ జట్టుకు 20 ఏళ్లుగా సేవలందిస్తోన్న రాస్ టేలర్.. ఇప్పటి వరకూ 445 అంతర్జాతీయ మ్యాచ్‌లాడి 18,074 పరుగులు సాధించాడు. ఇక న్యూజిలాండ్ తరఫున 100కి పైగా టెస్టులాడిన నాలుగో ప్లేయర్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకూ 112 టెస్టులాడిన టేలర్.. 7,683పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 233 వన్డేలు ఆడి 8581 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 102 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడి 1909 రన్స్ చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తోనూ టేలర్‌కు అనుబంధం ఉంది. వివిధ జట్ల తరఫున 55 మ్యాచ్‌లు ఆడి1,017 పరుగులు చేశాడు. ఇక మూడు ఫార్మాట్లలోనూ కొద్ది కాలం న్యూజిలాండ్‌కి సారథిగానూ వ్యవహరించిన రాస్ టేలర్ 2007 టీ20 వరల్డ్‌కప్, 2007, 2011, 2015, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లోనూ ఆడాడు. 2007 నుంచి 2016 వరకూ అన్ని టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో న్యూజిలాండ్ తరుపున ఆడిన రాస్ టేలర్ 2021 ప్రపంచకప్‌లో మాత్రం ఆడలేకపోయాడు.
ఘనంగా వీడ్కోలు..
కాగా నెదర్లాండ్స్ తో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో గెల్చుకున్న బ్లాక్ క్యాప్స్ చివరి వన్డేలోనూ ఘన విజయం సాధించింది. తద్వారా రాస్ టేలర్‌కు ఘనంగా వీడ్కోలు లభించినట్లయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్టిన్ గప్టిల్ (123 బంతుల్లో 106), విల్ యంగ్ (112 బంతుల్లో 120) సెంచరీలతో చెలరేగారు. ఇక ఛేదనలో నెదర్లాండ్స్ 42.3 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. దీంతో 115 పరుగులతో మ్యాచ్‌ను, 3-0 తో సిరీస్‌ను క్లీన్‌స్వీస్ చేసింది. కాగా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాస్‌టేలర్‌కు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, డేనియల్ వెటోరి తదితర క్రికెటర్లు విషెస్ తెలిపారు. రిటైర్‌మెంట్ తర్వాతి జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.
Ross Taylor is about to play his final international game of cricket for New Zealand.
We will miss you Rosco #SparkSport #NZvNED pic.twitter.com/Y6kmXVHvSH
— Spark Sport (@sparknzsport) April 4, 2022
Guard of honour for Ross Taylor by Netherlands. pic.twitter.com/XSwv2qv44A
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2022
Messages from around the cricketing world for @RossLTaylor ahead of his final match for New Zealand tomorrow at Seddon Park. #ThanksRosco #NZvNED pic.twitter.com/krmI1aUY2l
— BLACKCAPS (@BLACKCAPS) April 3, 2022