
Rohit Sharma : టీ20 ప్రపంచకప్ 2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వేళ, టీమిండియా గెలుపు అవకాశాలపై రోహిత్ శర్మ జియో హాట్ స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ మెగా టోర్నీలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ భారత్‌కు అత్యంత కీలకమైన ఆటగాళ్లని రోహిత్ అభిప్రాయపడ్డారు. అర్ష్‌దీప్ గురించి మాట్లాడుతూ.. కొత్త బంతితో స్వింగ్ చేయడం, డెత్ ఓవర్లలో వికెట్లు తీయడంలో అతను దిట్ట అని కొనియాడారు. 2024 వరల్డ్ కప్ ఫైనల్‌లో క్వింటన్ డి కాక్ వికెట్ తీయడంతో పాటు 19వ ఓవర్‌లో అతను వేసిన పొదుపైన బౌలింగ్ సౌతాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టిందని, అదే ఫామ్‌ను ఈసారి కూడా కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక హార్దిక్ పాండ్యా ప్రాముఖ్యత గురించి రోహిత్ స్పష్టత ఇచ్చారు. హార్దిక్ జట్టులో ఉంటే వచ్చే బ్యాలెన్సే వేరని ఆయన అన్నారు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలన్నా, ఆఖర్లో భారీ స్కోరు సాధించాలన్నా హార్దిక్ లాంటి ఫినిషర్ అవసరమని పేర్కొన్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ కొత్త బంతితో, మిడిల్ ఓవర్లలోనూ అతను వికెట్లు తీయగలడని.. అందుకే హార్దిక్ పాత్ర టీ20ల్లో చాలా కీలకమని రోహిత్ విశ్లేషించారు. ఆరుగురు బౌలర్లతో ఆడాలనుకున్నప్పుడు హార్దిక్ లాంటి ఆల్ రౌండర్ ఉండటం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు పెద్ద ఊరట అని చెప్పారు.
మరోవైపు, టీమిండియా స్పిన్ విభాగంపై రోహిత్ చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేశారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లను కలిసి ఆడించడం కోచ్ గౌతమ్ గంభీర్‌కు, కెప్టెన్ సూర్యకు పెద్ద సవాల్ అని అన్నారు. ఇద్దరూ వికెట్లు తీయగల సమర్థులే అయినా, భారత గడ్డపై మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంచు వల్ల ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం రిస్క్ అని హెచ్చరించారు. అయితే, వ్యక్తిగతంగా తానైతే ఇద్దరు వికెట్ టేకింగ్ స్పిన్నర్లకే ఓటు వేస్తానని రోహిత్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఇదే సమయంలో తన సహచర ఆటగాడు కుల్దీప్ యాదవ్‌కు రోహిత్ ఒక సరదా సలహా ఇచ్చారు. “కుల్దీప్‌కు నేను చెప్పేది ఒక్కటే.. సైలెంట్‌గా బౌలింగ్ చేసి నీ మార్క్ దగ్గరకు వెళ్లు. ప్రతి బంతికీ అప్పీల్ చేయకు. గల్లీ క్రికెట్ ఆడినట్లు ప్యాడ్‌కు తగిలిన ప్రతిసారీ అవుట్ అని అరవడం సరికాదు” అని నవ్వుతూ అన్నారు. రివ్యూల విషయంలో తాను ఎప్పుడూ కుల్దీప్ ముఖం చూడనని, కేవలం వికెట్ కీపర్ ఇచ్చే సలహా మేరకే డీఆర్‌ఎస్ తీసుకుంటానని చమత్కరించారు. ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని రోహిత్ ఆకాంక్షించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..