Rohit Sharma: అతనే గేమ్‌ ఛేంజర్‌.. ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆ ప్లేయర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ అద్భుతం: రోహిత్‌ శర్మ

టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఫైనల్ మ్యాచ్‌లోని ఉద్రిక్తతను, అక్షర్ పటేల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను, విరాట్ కోహ్లీ చూపిన పరిణితిని వివరించాడు. ఆరంభంలోనే భారత జట్టు కష్టాల్లో పడినప్పటికీ, అక్షర్, కోహ్లీల ప్రదర్శన వల్లే విజయం సాధ్యమైందని రోహిత్ అభిప్రాయపడ్డాడు.

Rohit Sharma: అతనే గేమ్‌ ఛేంజర్‌.. ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆ ప్లేయర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ అద్భుతం: రోహిత్‌ శర్మ
Rohit Sharma

Updated on: Jun 26, 2025 | 6:41 AM

టీమిండియా వన్డే టీమ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత తొలిసారి మాట్లాడుతూ.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మధురమైన సంఘటన గురించి తలచుకుంటూ.. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను ప్రశంసించాడు. ఎప్పుడో 2007లో మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచింది. మళ్లీ ఆ తర్వాత దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2004లో యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా విశ్వవిజేతగా అవతరించింది.

అంతకంటే ముందు ఏడాదే 2023లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా అద్బుతమైన ప్రదర్శనతో వరుసగా 10కి 10 మ్యాచ్‌లో నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ, ఫైనల్లో ఆసీస్‌ చేతుల్లో ఓడి.. వరల్డ్‌ కప్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడకముందే టీ20 వరల్డ్‌ కప్‌ ముంచుకొచ్చేసింది. సరే పెద్ద కాకపోయినా.. పొట్టి కప్పు కొట్టాలని ఆ బాధలోంచి వచ్చిన కసితో ఆడారు భారత ఆటగాళ్లు. లెక్కేసి కొడితే టీ20 వరల్డ్‌ కప్‌ చేతుల్లో వాలింది. అయితే సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. కేవలం 34 పరుగులకే భారత్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ టోర్నీలో అద్బుతంగా ఆడిన రోహిత్‌ శర్మ 9, రిషభ్‌ పంత్‌ 0, సూర్యకుమార్‌ యాదవ్‌ 3 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యారు. దీంతో డ్రెస్సింగ్‌ అంతా చాలా టెన్షన్‌ పడిందని, తాను కూడా చాలా భయాందోళనకు గురైనట్లు రోహిత్‌ శర్మ తెలిపాడు. కానీ, ఆ మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ ఆడిన ఇన్నింగ్స్‌ గేమ్‌ ఛేజింగ్‌ అని పేర్కొన్నాడు. 31 బంతుల్లో 47 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. చాలా మంది అక్షర్‌ ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడరు కానీ, అతనే గేమ్‌ ఛేంజర్‌ అంటూ అభినందించాడు. అలాగే క్రీజ్‌లో చివరి వరకు ఓ ప్లేయర్‌ ఆడాలని అనుకున్నాం అని ఆ పాత్రను విరాట్‌ కోహ్లీ అద్భుతంగా పోషించాడని, ఆ ఫైనల్‌లో కోహ్లీ ఎంతో గొప్పగా ఆడాడంటూ తన స్నేహితుడిని మెచ్చుకున్నాడు. ఆ రోజు ఏం చేయాలో కోహ్లీకి బాగా తెలుసని, అతను అదే చేశాడని అన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి