
Rohit Sharma : లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందని, 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఆయనకు చోటు లేదని రకరకాల పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ వివాదాలపై, విమర్శలపై నోరు విప్పని హిట్ మ్యాన్.. తన పవర్ ఫుల్ బ్యాట్‌తోనే సమాధానం చెప్పారు. ఆదివారం లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో విరుచుకుపడ్డారు. 138 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా, క్రికెట్ మెక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు.
ఒక కంట నవ్వు.. మరో కంట ఆనంద భాష్పాలు
ఇంగ్లాండ్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఓటమి పాలైనప్పటికీ, రోహిత్ శర్మ ఆడిన ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ అభిమానుల మనసులను గెలుచుకుంది. ఇన్నింగ్స్ 31వ ఓవర్ నాలుగో బంతికి ఆదిల్ రషీద్‌ను ఫోర్ కొట్టి రోహిత్ వన్డే కెరీర్‌లో 34వ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో లార్డ్స్ స్టేడియంలోని ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో అభినందించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో సహా ఆటగాళ్లంతా నిలబడి నివాళులర్పించారు. ఆ సమయంలో కెమెరా స్టేడియంలో ఉన్న రోహిత్ భార్య రితిక సజ్దే వైపు మళ్లగా.. ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఒకవైపు భర్త సాధించిన ఘనతకు గర్వంతో నవ్వుతూనే, మరోవైపు కళ్లలో ఆనంద భాష్పాలు రాలుస్తుండగా కళ్లు తుడిచేసుకుంటున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
110 బంతుల్లో 138 పరుగులు, 17 ఫోర్లు, 5 సిక్సర్లు
ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 పవర్ ఫుల్ సిక్సర్లతో ఏకంగా 138 పరుగులు చేశారు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. లార్డ్స్ వేదికగా కేవలం 84 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని, ఈ చారిత్రాత్మక మైదానంలో వేగవంతమైన వన్డే సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.
సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు
39 సంవత్సరాల 80 రోజుల వయస్సులో ఈ సెంచరీ సాధించడం ద్వారా వన్డే క్రికెట్‌లో సెంచరీ బాదిన అత్యంత వయోధికుడైన భారతీయ బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టారు. సచిన్ టెండూల్కర్ తన 38 ఏళ్ల 327 రోజుల వయసులో చివరి వన్డే సెంచరీ చేయగా, రోహిత్ ఆయనను దాటేసి టెస్టులు, వన్డేలు, టీ20లు అనే మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలోనూ అత్యధిక వయసులో సెంచరీ చేసిన భారతీయుడిగా అగ్రస్థానంలో నిలిచారు.
Lots of Emotions from Lords…!!
Virat hugging Rohit after his hundred.
Emotional Ritika 🥹,
Crowds erupts 🔥 #RohitSharma #ViratKohli #ENGvIND— Aarvika🌸 (@AarvikAA1) July 19, 2026
ఇంగ్లాండ్ గడ్డపై 8వ వన్డే సెంచరీ
ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ శర్మకు ఇది 8వ వన్డే సెంచరీ కావడం విశేషం. దీనితో ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోథిక్ రికార్డును ఆయన సమం చేశారు. ఇంగ్లాండ్‌లో అత్యధికంగా 10 వన్డే సెంచరీలు చేసిన రికార్డు జో రూట్ పేరిట ఉంది. విదేశీ గడ్డపై ఒకే దేశంలో ఏడు లేదా అంతకంటే ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన ప్రపంచ స్థాయి దిగ్గజ ఆటగాళ్ల సరసన రోహిత్ శర్మ నిలిచారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి