Team India : కింగ్ చార్లెస్ IIIని కలిసిన టీమిండియా… పంత్ మాత్రం మహిళా క్రికెటర్లతో!

లార్డ్స్ టెస్ట్ తర్వాత కింగ్ చార్లెస్ IIIని కలిసిన భారత పురుషుల జట్టులో, రిషబ్ పంత్ మాత్రం భారత మహిళా క్రికెటర్లతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రిషబ్ పంత్ మాంచెస్టర్‌లో జరగనున్న కీలకమైన నాలుగో టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Team India  : కింగ్ చార్లెస్ IIIని కలిసిన టీమిండియా... పంత్ మాత్రం మహిళా క్రికెటర్లతో!
Team India

Updated on: Jul 15, 2025 | 7:47 PM

Team India : లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైన మరుసటి రోజు భారత పురుషుల క్రికెట్ జట్టు సభ్యులు లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ IIIని కలిశారు. అయితే, జట్టు వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం తన సహచరులు కింగ్‌తో మాట్లాడుతుండగా, భారత మహిళా క్రికెటర్లతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిషబ్ పంత్ మహిళా జట్టుతో చాలా ఉల్లాసంగా ఉన్నట్లు ఈ వీడియోలో కనిపించింది.

లార్డ్స్ టెస్ట్ తర్వాత భారత పురుషుల జట్టు సభ్యులు ఒక అధికారిక కార్యక్రమంలో కింగ్ చార్లెస్ IIIని కలిశారు. ఈ సమయంలో రిషబ్ పంత్ మాత్రం అక్కడికి వచ్చిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో సరదాగా మాట్లాడటం కనిపించింది. సాధారణంగా ఇలాంటి అధికారిక కార్యక్రమాలలో ఆటగాళ్లు చాలా సీరియస్‌గా ఉంటారు. కానీ, పంత్ తనదైన శైలిలో, నవ్వుతూ, జోకులు వేస్తూ మహిళా క్రికెటర్లతో గడపడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

ప్రస్తుతం, భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్ ఆడుతోంది. మహిళల జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జులై 16న సౌతాంప్టన్‌లో ప్రారంభం కానుంది. పురుషుల జట్టు ఐదు టెస్టుల సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల తర్వాత 2-1తో వెనుకబడి ఉంది.

రిషబ్ పంత్ మాంచెస్టర్‌లో జరగనున్న కీలకమైన నాలుగో టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లార్డ్స్ టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేస్తున్నప్పుడు పంత్‌కు వేలికి గాయమైంది. దీంతో అతను స్టేడియం విడిచి వెళ్లిపోయాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు. పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులకే అవుట్ అయ్యాడు. స్కై స్పోర్ట్స్ నివేదిక ప్రకారం, పంత్ నాలుగో టెస్ట్‌లో ఆడే అవకాశం ఉంది. అలాగే, జస్ప్రీత్ బుమ్రా కూడా నాలుగో టెస్ట్‌లో ఆడవచ్చు. దీనివల్ల బుమ్రా ఓవల్‌లో జరిగే చివరి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..