Rishabh Pant Fitness Update: లండన్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. 280 పరుగులు అవసరమైన చివరి రోజు ఆటలో విరాట్ కోహ్లి, అజింక్యా రహానే కొంతవరకు రాణించినా.. ఆ తర్వాత వచ్చిన జడేజా సహా అంతా వెంటవెంటనే వెనుదిరిగారు. ఆ సమయంలో టీమిండియా గుండెల్లో మదిలిన ఒకే ఒక్క ఆలోచన ‘టీమ్‌లో రిషభ్ పంత్ ఉంటే బాగుండేది’. కానీ తనకు జరిగిన ప్రమాదం నుంచి కోలుకుంటున్న పంత్ ఆ సమయానికి అభిమానులు కోరిక తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే రానున్న టెస్ట్ ఫైనల్ నాటికి అలాంటి పరిస్థితి ఉండదు. అవును, ఎందుకంటే రిషభ్ పంత్ తన గాయాల నుంచి ఎంతో వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న పంత్.. NCA వైద్యుల పర్యవేక్షణలో ఫిట్‌నెస్ పొందే దిశగా అడుగులు వేస్తున్నాడు.
అంతేనా.. అందుకు సంబంధించిన వీడియోలను పంత్ స్వయంగా పోస్ట్ చేశాడు. దీంతో అవి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో కొన్ని రోజుల క్రితం నడిచేందుకు పంత్ ఎలా కష్టంగా ఫీలయ్యాడు, ఇప్పుడు ఎలాంటి సహాయం లేకుండా ఎలా నడుస్తున్నాడన్న దృశ్యాలు ఉన్నాయి. ఆ ఒక్క వీడియోలో రెండు సందర్భాలు ఉండగా.. మొదటి సందర్భంలో పంత్ మెట్లు ఎక్కడానికి కష్టంగా ఫీలైనది మనం చూడవచ్చు. అలాగే ఆ తర్వాత ఎలాంటి సహాయం లేకుండా సునాయాసంగా, సాధారణంగానే పంత్ మెట్లు ఎక్కి పైకి రావడాన్ని కూడా చూడవచ్చు. ఇక ఆ వీడియోను చూసిన టీమిండియా అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవాలి. పంత్ ఇలా వేగంగా కోలుకోవడం భారత క్రికెట్‌కి చాలా అవసరమని అభిమానులు రాసుకొస్తున్నారు.
Rishabh pant on a recovery mode …. pic.twitter.com/HAm1A8ipWx
— Ankit (@ankitmahato23) June 14, 2023
కాగా, రిషబ్ పంత్‌కు ఇకపై శస్త్రచికిత్స అవసరం లేదని ఇటీవల ఓ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో పంత్ కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. పంత్ కోలుకోవడం అనుకున్నదానికంటే మెరుగ్గా, వేగంగా జరుగుతోందని ఆ నివేదికలో చెప్పబడింది. వీడియో చూస్తుంటే పంత్ నిజంగా సరైన దారిలోనే ఉన్నాడని తెలుస్తోంది. ఫలితంగా అనుకున్న దాని కంటే ముందుగానే, పంత్ భారత జట్టులోకి పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..