Video: వామ్మో.. ఇది బాల్ కాదు అర్జునుడి బ్రహ్మాస్త్రం.. స్టంప్‌ను రెండుగా చీల్చేసిందిగా.. వీడియో చూస్తే షాకే..

Riley Meredith Split a Stump Down the Middle: క్రికెట్‌లో స్టంప్స్ బద్దలు కొట్టడం చాలాసార్లు చూసే ఉంటారు. కానీ బంతితో ఎవరైనా స్టంప్స్‌ను మధ్యలోకి చీల్చడం మీరు ఎప్పుడైనా చూశారా? తాజాగా ఇలాంటి సంఘటనే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Video: వామ్మో.. ఇది బాల్ కాదు అర్జునుడి బ్రహ్మాస్త్రం.. స్టంప్‌ను రెండుగా చీల్చేసిందిగా.. వీడియో చూస్తే షాకే..
Riley Meredith Split A Stump (1)

Updated on: Jul 09, 2025 | 1:00 PM

Riley Meredith Split a Stump Down the Middle: క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లు స్టంప్‌లను విరగొట్టడం, లేదంటే బెండ్లు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, స్టంప్‌ను సరిగ్గా మధ్యలో చీల్చేయడం ఎప్పుడైనా చూశారా? అలాంటి అరుదైన, షాకింగ్ సంఘటనే ఇటీవల వైటాలిటీ బ్లాస్ట్‌లో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ రిలే మెరెడిత్ విసిరిన ఒక మెరుపు బంతి స్టంప్‌ను అడ్డంగా చీల్చేసింది. ఈ ఘటన ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది.

సోమర్‌ సెట్ తరపున ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిలే మెరెడిత్ ఈ అద్భుతాన్ని సృష్టించాడు. ఎసెక్స్ ఓపెనర్ మైకేల్ పెప్పర్‌కు మెరెడిత్ విసిరిన ఒక వేగవంతమైన యార్కర్ బంతి నేరుగా లెగ్ స్టంప్‌ను తాకింది. బంతి ఎంత వేగంగా, ఎంత బలంగా తగిలిందంటే, స్టంప్ రెండుగా చీలిపోయింది. అందులో ఒక భాగం నేలలో పాతుకుపోయి ఉండగా, మరొక భాగం విరిగి దూరంగా పడింది. ఈ దృశ్యం చూసిన కామెంటేటర్లు, ఆటగాళ్లు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

ఆటగాళ్లు, అభిమానులు షాక్..!

మైకేల్ పెప్పర్ ఔటైన తీరుకు తోడు, స్టంప్ విరిగిపోయిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. కామెంటేటర్లు “అతను స్టంప్‌లను పూర్తిగా ధ్వంసం చేశాడు!” అని గట్టిగా చెప్పుకొచ్చారు. ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఇది నిజంగా అద్భుతమైన దృశ్యం అని కొనియాడారు. మెరెడిత్ కూడా బంతి స్టంప్‌ను చీల్చేయడం చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి విరిగిన స్టంప్‌ను ట్రోఫీలా ఎత్తుకొని చూపించాడు.

ఈ మ్యాచ్‌లో మెరెడిత్ అద్భుతమైన బౌలింగ్‌తో రాణించి 2 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సోమర్ సెట్ ఈ మ్యాచ్‌ను 95 పరుగుల భారీ తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. వైటాలిటీ బ్లాస్ట్‌లో మెరెడిత్ ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడు కావడం గమనార్హం.

ఈ అసాధారణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బౌలర్ వేగానికి స్టంప్ రెండుగా చీలిపోవడం నిజంగా అరుదైన దృశ్యం అని క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..