Yash Dayal : యశ్ దయాల్ కేసులో కొత్త మలుపు.. ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు

ఆర్‌సీబీ క్రికెటర్ యశ్ దయాల్‌కి లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు అతని అరెస్ట్‌పై స్టే విధించింది. కోర్టు బాధితురాలికి నోటీసు జారీ చేసి, ఆమె నుంచి వివరణ కోరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఈ కేసులో తమ వాదనలు వినిపించాలని ఆదేశించింది.

Yash Dayal : యశ్ దయాల్ కేసులో కొత్త మలుపు.. ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
Yash Dayal

Updated on: Jul 15, 2025 | 3:55 PM

Yash Dayal : ఐపీఎల్‎లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడే క్రికెటర్ యశ్ దయాల్‎కు అలహాబాద్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, అతని అరెస్ట్‌పై స్టే విధించింది. అంతేకాకుండా, అతనిపై ఎలాంటి వేధింపు చర్యలు తీసుకోకుండా కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది యశ్ దయాల్‌కి తాత్కాలికంగా పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. ఈ కేసుపై న్యాయమూర్తులు సిద్ధార్థ్ వర్మ, అనిల్ కుమార్ దశమ్ ల డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. యశ్ దయాల్ తరపున న్యాయవాది గౌరవ్ త్రిపాఠి వాదనలు వినిపించారు. విచారణ సమయంలో హైకోర్టు ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది. “ఇద్దరూ ఐదు సంవత్సరాల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధం పెట్టుకున్నారని అనడం సరి కాదు” అని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఫిర్యాదు చేసిన బాధితురాలి స్పందన అవసరమని కూడా కోర్టు అభిప్రాయపడింది.

కోర్టు బాధితురాలికి నోటీసు జారీ చేసి, ఆమె నుంచి వివరణ కోరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఈ కేసులో తమ వాదనలు వినిపించాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నాలుగు నుంచి ఆరు వారాల్లో జరగనుంది. యశ్ దయాల్‌పై జులై 6న ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ ఎఫ్‌ఐఆర్ భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 69 కింద నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత, యశ్ దయాల్ దానిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరాపురం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, బాధితురాలిని ప్రతివాదులుగా చేర్చాడు. హైకోర్టు ఇచ్చిన ఈ తాత్కాలిక ఆదేశం యశ్ దయాల్‌కి పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అయితే, ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..