
RCB Sale : ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వక ముందే మైదానం బయట ఒక భారీ వ్యాపార యుద్ధం జరుగుతోంది. లీగ్‌లోనే అత్యంత పాపులర్ టీమ్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం మారబోతోంది. ప్రస్తుతం ఈ టీమ్ యజమానిగా ఉన్న డియాజియో (United Spirits) సంస్థ, తమ కార్యకలాపాలను వేరే వారికి అప్పగించాలని నిర్ణయించుకుంది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆర్సీబీ టీమ్ విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,600 కోట్లు) గా నిర్ణయించారు. ఇంత భారీ ధర కావడంతో చాలా మంది రేసు నుంచి తప్పుకోగా, ఇప్పుడు కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు.
ఆర్సీబీ కోసం స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ EQT భారీ బిడ్ వేసింది. ఈ సంస్థతో పాటు రంజన్ పాయ్ నేతృత్వంలోని కన్సార్టియం కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ కన్సార్టియంలో అమెరికన్ ఈక్విటీ సంస్థ కోల్‌బర్గ్ క్రావిస్ రాబర్ట్స్ (KKR & Co), సింగపూర్‌కు చెందిన టెమాసెక్ వంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ రేసులో మాంచెస్టర్ యునైటెడ్ యజమానులైన గ్లేజర్ ఫ్యామిలీ, సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ముందు వరుసలో ఉన్నప్పటికీ, వారు కేవలం 1.8 బిలియన్ డాలర్ల వద్దే ఆగిపోయారు. దీంతో ఇప్పుడు EQT, రంజన్ పాయ్ గ్రూపుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమే కాదు, రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా అమ్మకానికి సిద్ధమైంది. ఆ టీమ్ మెజారిటీ వాటాదారుడైన మనోజ్ బదలే తన వాటాను పూర్తిగా విక్రయించాలని చూస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ విలువను దాదాపు 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9,100 కోట్లు)గా అంచనా వేస్తున్నారు. ఈ టీమ్ కోసం ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ గ్రూప్‌కు ఇప్పటికే ఇంగ్లండ్‌లోని ద హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ టీమ్‌లో వాటా ఉండటం విశేషం.
ఆర్సీబీకి సంబంధించిన బిడ్డింగ్ గడువు మార్చి 31తో ముగియనుంది. ఒకవేళ ఇద్దరు పోటీదారులు డియాజియో ఆశించిన 2 బిలియన్ డాలర్ల ధరను ఇస్తే, అప్పుడు ఎవరికి అమ్మాలనేది యజమాన్యం నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ 2026 ద్వితీయార్థం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్ లో ఇప్పటికీ కప్పు గెలవకపోయినా, అత్యధిక ఫ్యాన్ బేస్, బ్రాండ్ వాల్యూ ఉండటంతో ఆర్సీబీ టీమ్ కోసం ఇంతలా పోటీ పడుతున్నారు. మరి ఈసారి కొత్త యజమానుల రాకతో బెంగళూరు జాతకం మారుతుందో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..