
IPL Team RCB : ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) ఆధీనంలో ఉంది. అయితే, మంగళవారం జరిగిన ఒక చారిత్రాత్మక ఒప్పందంలో 100 శాతం వాటాను ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. ఈ గ్రూపులో ఆదిత్య బిర్లాతో పాటు అమెరికన్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్ కు చెందిన బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ కు చెందిన బీఎక్స్‌పీఈ (BXPE), టైమ్స్ గ్రూప్ భాగస్వాములుగా ఉన్నాయి. కేవలం మెన్ టీమ్ మాత్రమే కాకుండా, మహిళల టీమ్ (WPL) కూడా ఇప్పుడు ఈ కొత్త యజమానుల సొంతమైంది.
పేరు మారుతుందా? అనన్య బిర్లా ఏమన్నారంటే..
ఆర్సీబీ కొత్త యజమానుల చేతుల్లోకి వెళ్లగానే, టీమ్ పేరులో రాయల్ అనే పదాన్ని తొలగిస్తారని లేదా పూర్తిగా పేరు మారుస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే, ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన అనన్య బిర్లా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను రీ-షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆర్సీబీ పేరు మారదు అని స్పష్టంగా ఉండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్సీబీ అనేది ఒక బ్రాండ్ అని, దాన్ని మార్చడం కొత్త యజమానులకు కూడా ఇష్టం లేదని తెలుస్తోంది. గతేడాది అంటే 2025లో ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే, ఆ జోష్‌లోనే ఈ మెగా డీల్ కుదిరింది.
ఖరీదైన టీమ్ గా ఆర్సీబీ రికార్డు
గతంలో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ అత్యంత ఖరీదైన జట్టుగా ఉండేది (దాదాపు రూ.7,000 కోట్లు). కానీ ఇప్పుడు ఆర్సీబీ ఆ రికార్డును మట్టికరిపించింది. రూ.16,706 కోట్ల ధర అంటే ఐపీఎల్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్ ఉండటం, విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండటం ఈ జట్టుకు ఇంత భారీ ధర పలకడానికి కారణమయ్యాయి. నవంబర్ 2025లోనే USL ఈ జట్టు విక్రయానికి సంబంధించి కసరత్తు ప్రారంభించింది, చివరకు మార్చి 2026లో ఈ ప్రక్రియ పూర్తయింది.
ముందు ముందు ఏం జరుగుతుంది?
ఆర్సీబీ యాజమాన్యం మారినా, కోర్ టీమ్, మేనేజ్మెంట్ శైలిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ జట్టును గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్‌గా మార్చాలని ప్లాన్ చేస్తోంది. ఈ మెగా డీల్ ద్వారా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ మరింత పెరగడమే కాకుండా, భవిష్యత్తులో ఇతర ఫ్రాంచైజీల అమ్మకాలకు ఇది ఒక బెంచ్ మార్క్ గా నిలవనుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం తమ జట్టు పేరు మారనందుకు పండగ చేసుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..