
క్రికెట్ ప్రపంచంలో ప్రతిభ మాత్రమే సరిపోదు, దానికి అదృష్టం, సరైన సమయం కూడా తోడవ్వాలి. ఒకప్పుడు వయసు తారుమారు వివాదంతో కెరీర్ ముగిసిపోయిందనుకున్న చోటే, పట్టుదలతో పోరాడి ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రధాన విజయకేతనంగా నిలిచాడు జమ్మూ కాశ్మీర్ యువ ఫాస్ట్ బౌలర్ రసిఖ్ సలామ్. నిషేధం నుంచి గెలుపు శిఖరాల వరకు సాగిన అతని రోమాంచిత ప్రయాణం ఎందరికో ఆదర్శంగా మారింది.
రసిఖ్ సలామ్ కథ కేవలం ఒక సాధారణ క్రికెటర్ ప్రయాణం కాదు. అపజయాల నుంచి ఎలా ఫీనిక్స్ పక్షిలా లేవాలో నేర్పే ఒక పాఠం. 2019వ సంవత్సరంలో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ బరిలోకి దిగి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ జమ్మూ కాశ్మీర్ పేసర్. అదే సమయంలో భారత్ అండర్-19 జట్టులోనూ చోటు దక్కించుకుని ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమయ్యాడు.
కానీ, దురదృష్టం వయసు ధృవీకరణ పత్రాల రూపంలో వెంటాడింది. జనన ధృవీకరణ పత్రంలో తేడాలుండటంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అతనిపై రెండేళ్ల పాటు కఠిన నిషేధం విధించింది. ఎదుగుతున్న కెరీర్‌కు ఆరంభంలోనే బ్రేక్ పడటంతో, రసిఖ్ భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది.
ఆ రెండేళ్ల కాలం ఒక యువ ఆటగాడికి నరకప్రాయం. క్రికెట్‌కు దూరమై, మళ్లీ మైదానంలో అడుగుపెట్టగలనా లేదా అన్న అనుమానాలు ముసురుకున్న వేళ రసిఖ్ అధైర్యపడలేదు. స్థానిక మైదానాల్లో కఠినమైన శిక్షణను కొనసాగించాడు. ఈ కష్టకాలంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతనికి అండగా నిలిచింది. అతని ప్రతిభను గుర్తించి, మానసికంగా కుంగిపోకుండా వెన్నుతట్టి ప్రోత్సహించింది.
నిషేధం ముగిసిన తర్వాత, 2021-22 దేశవాళీ సీజన్‌లో మళ్లీ పాత ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ తనలోని సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఈ క్రమంలోనే 2025 వేలంలో ఆర్సీబీ ఏకంగా ఆరు కోట్ల రూపాయల భారీ ధరతో అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు అత్యంత కీలకమైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అతడిని అంటిపెట్టుకుంది.
ఐపీఎల్ 2026 సీజన్ రసిఖ్ సలామ్ జీవితాన్నే మార్చేసింది. టోర్నమెంట్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌లకు తుది జట్టులో అవకాశం రాకపోయినా, వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి అంతర్జాతీయ దిగ్గజ బౌలర్ల సరసన మూడో పేసర్‌గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ఈ సీజన్‌లో రసిఖ్ మొత్తం 19 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్లను వణికించాడు. 21.31 సగటుతో, 9.45 ఎకానమీ రేటుతో అత్యంత కీలకమైన ఓవర్లలో వికెట్లు తీస్తూ ఆర్సీబీ బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచాడు. ఒత్తిడి సమయాల్లో ప్రశాంతంగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్‌లను మలుపు తిప్పడం అతని ప్రత్యేకతగా మారింది.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ రసిఖ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ మహా సంగ్రామంలో కేవలం 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఒకప్పుడు నిషేధంతో మైదానానికి దూరమైన ఒక సాధారణ బౌలర్, ఈరోజు ఐపీఎల్ ఫైనల్ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
తప్పులు ఎవరైనా చేయవచ్చు, కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకుని, పట్టుదలతో తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడమే నిజమైన విజయం. రసిఖ్ సలామ్ ప్రయాణం ఈ తరానికి ఒక గొప్ప స్ఫూర్తి. ఆటంకాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, తన నైపుణ్యాన్ని నమ్ముకుని పోరాడిన రసిఖ్, నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల గుండెల్లో ‘నిజమైన విజేత’గా నిలిచాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..