
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ కోసం అన్ని ఫ్రాంఛైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో చురుగ్గా ఉన్నాయి. వేలానికి ముందే జరుగుతున్న ట్రేడింగ్ విండోలో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ చాలా చురుగ్గా కదులుతోంది. గత ఐదు సీజన్లలో ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన ముంబై జట్టు, తమ బలహీనంగా ఉన్న స్పిన్ డిపార్ట్‌మెంట్‌ను పటిష్టం చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో 2020లో తమకు చివరి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఒక పాత లెగ్ స్పిన్నర్‌ను మళ్లీ జట్టులోకి తీసుకురావాలని ముంబై యోచిస్తోంది.
ముంబై ఇండియన్స్ జట్టు తమ స్పిన్ విభాగాన్ని పటిష్టం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో రెండుసార్లు తమతో టైటిల్ గెలిచిన పాత లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాహుల్ చాహర్ 2020లో ముంబై ఇండియన్స్ చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నాడు.
గత ఐపీఎల్ సీజన్‌లో చాహర్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో ముంబై అతన్ని తిరిగి జట్టులోకి తీసుకురావాలని ఉవ్విళ్లూరుతోంది. ముంబై ఇండియన్స్ ఇంకా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అధికారిక చర్చలు ప్రారంభించనప్పటికీ, ఈ పాత ఆటగాడిని వెనక్కి తీసుకురావడానికి చాలా ఆసక్తిగా ఉంది.
ముంబై ఇండియన్స్ రాహుల్ చాహర్‌ను ట్రేడ్ చేసుకోవడం అంత సులభం కాదు. దీనికి ఆర్థికపరమైన సమస్య ఒకటి ఉంది. ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్లను ఇవ్వకుండా, పూర్తిగా క్యాష్ డీల్ ద్వారానే చాహర్‌ను తీసుకోవాలని భావిస్తోంది. రాహుల్ చాహర్ ప్రస్తుత ట్రేడింగ్ విలువ రూ.3.2 కోట్లు. ఈ మొత్తాన్ని ట్రేడింగ్ విండోలో చెల్లించడం ముంబై ఇండియన్స్‌కు అంత తేలికైన విషయం కాదు. ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించడం జట్టు బడ్జెట్‌పై భారం కావచ్చు.
రాహుల్ చాహర్ డీల్ ఏదైనా కారణం చేత కుదరకపోతే, ముంబై ఇండియన్స్ తమ ప్లాన్ బి వైపు దృష్టి సారించనుంది. ముంబై ఇండియన్స్ తమ మరో మాజీ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను తిరిగి జట్టులోకి తీసుకోవాలని చూస్తోంది. మయాంక్ ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్నాడు. మయాంక్ మార్కండేను కేకేఆర్ కేవలం రూ.30 లక్షల తక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఈ తక్కువ మొత్తాన్ని చెల్లించడం ముంబైకి సులభం అవుతుంది. అందుకే కేకేఆర్ ముందు తమ ప్రతిపాదనను ఉంచడానికి ముంబై సిద్ధమవుతోంది. మయాంక్ మార్కండే కూడా 2018లో ముంబై ఇండియన్స్ తరఫునే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..