
Shreyas Iyer vs Shashank Singh Video: ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (87 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. అయితే, మ్యాచ్ అనంతరం శశాంక్ సింగ్‌పై శ్రేయాస్ అయ్యర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, అతనికి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది?
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. అయితే, కీలక సమయంలో శశాంక్ సింగ్ కేవలం 2 పరుగులకే రనౌట్ అయ్యాడు. 17వ ఓవర్ నాల్గవ బంతికి శశాంక్ సింగ్ మిడ్-ఆన్ దిశగా బంతిని కొట్టి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేరుగా వికెట్లను కొట్టడంతో శశాంక్ రనౌట్ అయ్యాడు. రీప్లేలలో శశాంక్ సింగ్ డైవ్ చేయకుండా చాలా నెమ్మదిగా పరుగెత్తడం స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో పంజాబ్‌కు 20 బంతుల్లో 35 పరుగులు అవసరం కాగా, ఈ వికెట్ పడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
అయ్యర్ ఆగ్రహం, వైరల్ వీడియో..
#PBKSvsMI Shreyas Iyer angry on Shashank for His absence in running between games … pic.twitter.com/uQcmtSzt31
— honey sriwas (@hsriwas) June 2, 2025
పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచిన తర్వాత, ఆటగాళ్లందరూ శ్రేయాస్ అయ్యర్‌ను అభినందించడానికి మైదానంలోకి వచ్చారు. అయ్యర్ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో, తన జట్టు సభ్యులతో షేక్‌హ్యాండ్‌లు ఇస్తూ వచ్చాడు. అయితే, శశాంక్ సింగ్ దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యర్ అతనికి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, కోపంతో శశాంక్‌పై కొన్ని ఘాటైన మాటలు విసిరాడు. “నా మొహం చూడకు” అంటూ కొన్ని అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. శశాంక్ సింగ్ ఏమీ మాట్లాడకుండా, నేలకు తల వంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
కారణం ఏంటంటే?
శ్రేయాస్ అయ్యర్ సాధారణంగా ప్రశాంతంగా ఉండే కెప్టెన్‌గా పేరుపొందాడు. అలాంటి అతను సహచర ఆటగాడిపై ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించింది. శశాంక్ సింగ్ రనౌట్ అయిన తీరు, అతని అలసత్వమే అయ్యర్ కోపానికి కారణమని భావిస్తున్నారు. కీలకమైన మ్యాచ్‌లో, కీలక సమయంలో ఇలాంటి తప్పు చేయడం వల్ల జట్టుకు నష్టం జరిగే అవకాశం ఉందని అయ్యర్ భావించాడు.
ఈ సంఘటనపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయ్యర్ కోపాన్ని సమర్థించగా, మరికొందరు కెప్టెన్ గా బహిరంగంగా ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఆటలో ఒత్తిడి సాధారణమే అయినప్పటికీ, సహచర ఆటగాళ్లతో ఇలా వ్యవహరించడం టీం స్పిరిట్‌ను దెబ్బతీస్తుందని కొందరు వాదిస్తున్నారు. అయితే, శశాంక్ సింగ్ ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వకుండా మౌనంగా ఉండటం అతని పరిణతిని చాటి చెబుతోంది.
పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న నేపథ్యంలో, ఈ సంఘటన జట్టుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనున్న పంజాబ్ కింగ్స్, ఈ వివాదాన్ని పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగితేనే విజయం సాధించగలదు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..