
Team India Vice Captain For 2027 World Cup: భారత క్రికెట్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఇటీవల కాలంలో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. ముఖ్యంగా అతని కెప్టెన్సీ నైపుణ్యాలు, ఒత్తిడిలో తీసుకునే సమర్థవంతమైన నిర్ణయాలు, బ్యాటింగ్‌లో స్థిరత్వం అతన్ని భవిష్యత్తులో టీమిండియా నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్న ఆటగాడిగా నిలుపుతున్నాయి. 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో శ్రేయాస్ అయ్యర్ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు బలంగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
కెప్టెన్‌గా తిరుగులేని రికార్డులు..
శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్లను (ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్) ఫైనల్స్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. 2020లో ఢిల్లీని, 2024లో కోల్‌కతాను (టైటిల్ విజేతగా), 2025లో పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు. ఈ విజయాలు అతని కెప్టెన్సీ నైపుణ్యాలకు, జట్టును నడిపించే సామర్థ్యానికి నిదర్శనం. ముఖ్యంగా ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టుకు 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్, ఫైనల్స్ అవకాశం దక్కించి, కెప్టెన్‌గా తన విలువను చాటుకున్నాడు. అంతేకాకుండా, ఈ సీజన్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు (39) కొట్టి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
బ్యాట్స్‌మెన్‌గా నిలకడైన ప్రదర్శన..
ఐపీఎల్‌లోనే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా శ్రేయాస్ అయ్యర్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో 10 ఇన్నింగ్స్‌లలో 526 పరుగులు చేసి, టీమిండియా జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించాడు. నెదర్లాండ్స్, న్యూజిలాండ్‌లపై వరుస సెంచరీలతో తన సత్తా చాటాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా భారత్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి, టోర్నమెంట్‌లో 243 పరుగులతో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇదంతా అతను గాయం నుంచి కోలుకున్న తర్వాత సాధించిన విజయం కావడం విశేషం.
భవిష్యత్ నాయకత్వం..
రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ పేర్లు కూడా వినిపించినప్పటికీ, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ అనుభవం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం అతనికి ప్లస్ పాయింట్లు. భారత టెస్టు జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ప్రకటించినప్పటికీ, వన్డే ఫార్మాట్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. అతని కెప్టెన్సీ శైలి, రోహిత్ శర్మతో సారూప్యతలు కలిగి ఉండటం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. అనవసరమైన దూకుడు లేకుండా, చాలా ప్రశాంతంగా వ్యూహాలు రచించి ప్రత్యర్థులను చిత్తు చేయడంలో అయ్యర్ సమర్థుడు.
బీసీసీఐ అధికారులు, సెలెక్టర్లు శ్రేయాస్ అయ్యర్ నైపుణ్యాలను, అతని నిలకడైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని, 2027 వన్డే ప్రపంచకప్‌లో అతనికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇది భారత క్రికెట్‌కు భవిష్యత్ నాయకుడిని అందించే ఒక కీలకమైన అడుగు అవుతుందని మాజీలు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..