IPL vs PSL : ఐపీఎల్ దెబ్బకు పీఎస్‌ఎల్ ఖాళీ..రూ.28 కోట్ల నష్టంతో పాకిస్తాన్ లీగ్‌కు పెద్ద ఎదురుదెబ్బ

IPL vs PSL : ఐపీఎల్ 2026 వేలం కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)కు భారీ నష్టం వాటిల్లింది. పీఎస్‌ఎల్ జట్లలో కీలక సభ్యులుగా ఉన్న 11 మంది అంతర్జాతీయ ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంఛైజీలు దక్కించుకోవడమే దీనికి ప్రధాన కారణం.

IPL vs PSL : ఐపీఎల్ దెబ్బకు పీఎస్‌ఎల్ ఖాళీ..రూ.28 కోట్ల నష్టంతో పాకిస్తాన్ లీగ్‌కు పెద్ద ఎదురుదెబ్బ
Ipl Vs Psl

Updated on: Dec 17, 2025 | 4:23 PM

IPL vs PSL : ఐపీఎల్ 2026 వేలం కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)కు భారీ నష్టం వాటిల్లింది. పీఎస్‌ఎల్ జట్లలో కీలక సభ్యులుగా ఉన్న 11 మంది అంతర్జాతీయ ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంఛైజీలు దక్కించుకోవడమే దీనికి ప్రధాన కారణం. వీరి కోసం ఐపీఎల్ యాజమాన్యాలు మొత్తం రూ.27.3 కోట్లు వెచ్చించాయి. ఈ 11 మందిలో 10 మందిని వేలంలో కొనుగోలు చేయగా, మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.3 కోట్లకు ముందే రిటైన్ చేసుకుంది. ఐపీఎల్, పీఎస్‌ఎల్ తదుపరి సీజన్లు ఒకే సమయంలో ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో, ఈ ఆటగాళ్లందరూ పీఎస్‌ఎల్‌ను వదులుకుని ఐపీఎల్‌లోనే ఆడే అవకాశం ఉంది.

పీఎస్‌ఎల్ నుంచి ఐపీఎల్‌కు మారిన ఆటగాళ్లలో ఫిన్ అలెన్, జేసన్ హోల్డర్, టిమ్ సైఫర్ట్, మాథ్యూ షార్ట్, అకీల్ హోసేన్, కైల్ జేమీసన్, ల్యూక్ వుడ్, ఆడమ్ మిల్నే, జోర్డాన్ కాక్స్, బెన్ ద్వార్షుయిస్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరి చేరికతో ఐపీఎల్ జట్లు మరింత బలోపేతం కాగా, పీఎస్‌ఎల్ మాత్రం తన స్టార్ ఆటగాళ్లను కోల్పోయి కళ తప్పేలా కనిపిస్తోంది. ఆటగాళ్లు ఆర్థికంగా, క్రీడా పరంగా ఎంతో లాభదాయకమైన ఐపీఎల్‌కే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం పీఎస్‌ఎల్ నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఈ వేలంలో ఏ ప్లేయర్‌ను ఏ టీమ్ కొనుగోలు చేసిందనే వివరాలను పరిశీలిస్తే.. క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఆడిన ఫిన్ అలెన్‌ను కేకేఆర్ రూ.2 కోట్లకు, అకీల్ హోసేన్‌ను సీఎస్‌కే రూ.2 కోట్లకు, కైల్ జేమీసన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేశాయి. ఇస్లామాబాద్ యునైటెడ్ నుంచి జేసన్ హోల్డర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.7 కోట్లకు, మాథ్యూ షార్ట్‌ను సీఎస్‌కే రూ.1.5 కోట్లకు, జోర్డాన్ కాక్స్‌ను ఆర్‌సీబీ రూ.75 లక్షలకు, బెన్ ద్వార్షుయిస్‌ను పంజాబ్ కింగ్స్ రూ.4.40 కోట్లకు దక్కించుకున్నాయి. కరాచీ కింగ్స్ నుంచి టిమ్ సైఫర్ట్‌ను కేకేఆర్ రూ.1.50 కోట్లకు, ఆడమ్ మిల్నేను రాజస్థాన్ రాయల్స్ రూ.2.40 కోట్లకు తీసుకున్నాయి. అలాగే పెషావర్ జల్మీకి ఆడిన ల్యూక్ వుడ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.75 లక్షలకు సొంతం చేసుకుంది.

పీఎస్‌ఎల్, ఐపీఎల్ మధ్య తలెత్తిన ఈ చిక్కుముడికి ప్రధాన కారణం రెండు లీగ్‌ల షెడ్యూల్‌లు ఒకేసారి రావడం. నివేదికల ప్రకారం రెండు లీగ్‌లు మార్చి 26 నుండే ప్రారంభం కానున్నాయి. ఒకే సమయంలో రెండు లీగ్‌లు జరిగినప్పుడు, ఆటగాళ్లు సహజంగానే అత్యధిక ఆదాయం, క్రేజ్ ఉన్న ఐపీఎల్‌నే ఎంచుకుంటారు. ఈ 11 మంది ఆటగాళ్లు కూడా అదే బాటలో పయనిస్తూ పీఎస్‌ఎల్ తదుపరి సీజన్‌కు దూరం కానున్నారు. ఇది పీఎస్‌ఎల్ ఫ్రాంఛైజీలకు ఆటగాళ్ల ఎంపిక విషయంలో పెద్ద సవాలుగా మారనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..