
Prithvi Shaw : క్రికెటర్ పృథ్వీ షా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా, ఈ కేసులో పృథ్వీ షాకు ముంబై సెషన్స్ కోర్టు రూ.100 జరిమానా విధించింది. సప్నా గిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై పృథ్వీ షా తన సమాధానం సమర్పించడంలో విఫలం కావడమే దీనికి కారణం. పోలీసుల నివేదిక ప్రకారం.. ముంబైలోని అంధేరి పబ్‌లో 2023 ఫిబ్రవరి 15న జరిగిన గొడవకు సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో పృథ్వీ షాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సప్నా గిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని కోర్టు గతంలో అనేక సార్లు పృథ్వీ షాకు సూచించింది. చివరి విచారణలో కూడా కోర్టు హెచ్చరించినప్పటికీ, పృథ్వీ షా మంగళవారం నాటి విచారణకు తన సమాధానాన్ని సమర్పించలేదు. దీంతో మరోసారి రూ.100 జరిమానాతో అవకాశం ఇస్తున్నాము అని న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేశారు.
సప్నా గిల్ ఆరోపణలు
పోలీసుల నివేదిక ప్రకారం.. 2023 ఫిబ్రవరి 15న రాత్రి 1 గంట సమయంలో అంధేరి పబ్‌లో సప్నా గిల్ స్నేహితుడు శోబిత్ ఠాకూర్ పృథ్వీ షాతో సెల్ఫీలు అడిగాడు. పృథ్వీ షా నిరాకరించడంతో గొడవ మొదలైంది. పృథ్వీ షా తన స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్‌తో కలిసి వెళ్తుండగా, ఠాకూర్‌పై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి జరిగింది. పృథ్వీ షా మాత్రం తప్పించుకున్నాడు. ఆ తర్వాత శోబిత్ ఠాకూర్, సప్నా గిల్‌తో సహా ఆరుగురు వ్యక్తులు యాదవ్ వెంటపడి రూ. 50,000 డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత పోలీసులు సప్నా గిల్ తో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేసి, ఫిబ్రవరి 17న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సప్నా గిల్ మూడు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.
అయితే, ఈ సంఘటనపై సప్నా గిల్ వెర్షన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఆమె ఆరోపణల ప్రకారం.. షా, యాదవ్ తమ వీఐపీ టేబుల్‌లో కూర్చోమని ఆమెను, ఠాకూర్‌ను ఆహ్వానించారు. ఠాకూర్ సెల్ఫీలు అడిగినప్పుడు, షా, యాదవ్ అతనిపై దాడి చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ గొడవలో తాను జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు, పృథ్వీ షా తనను వేధించాడని, లైంగికంగా దాడి చేశాడని సప్నా గిల్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సప్నా గిల్ పృథ్వీ షాపై కౌంటర్ ఫిర్యాదు కూడా దాఖలు చేశారు.
Prithvi Shaw Attacked In Mumbai By Some Drunk People.
This Video Is Very Scary. Fans Need To Understand They Can't Misbehave With Any Celebrity.
Prithvi Somehow Managed To Grab Baseball Bat From That Lady.
This Lady Attacked Prithvi Shaw Car With Baseball Bat. pic.twitter.com/thtyECpE1w
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) February 16, 2023
కొనసాగుతున్న కేసు
సప్నా గిల్ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు మెజిస్ట్రేట్ కోర్టు మొదట నిరాకరించింది.. బదులుగా ఈ విషయంపై పోలీసు విచారణకు ఆదేశించింది. ఈ నిర్ణయంతో సంతృప్తి చెందని సప్నా గిల్ 2024 ఏప్రిల్‌లో సెషన్స్ కోర్టును ఆశ్రయించి, క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. షా ఇప్పుడు రూ. 100 జరిమానా చెల్లించి, డిసెంబర్ 16న జరిగే తదుపరి విచారణకు ముందు తన సమాధానాన్ని సమర్పించాల్సి ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..