విజయ్ హజారే ట్రోఫీ కోసం పృథ్వీ షా ముంబై జట్టులో చోటు కోల్పోవడం క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది. యువ ఓపెనర్ పృథ్వీ తన ఆటలో టాలెంట్ చూపించినప్పటికీ, ఫిట్‌నెస్ సమస్యలు అతని ప్రస్థానంలో కీలక ఆటంకంగా మారాయి.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో పృథ్వీ సాధించిన సగటు ప్రదర్శన ఇప్పటికే విమర్శలకు గురవగా, అతని ఫిట్‌నెస్‌పై వచ్చిన తీర్పులు మరింత సంక్లిష్టం చేశాయి. ఇదే సమయంలో, ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని IPL 2025 వేలంలో విడుదల చేయడం, ఆ తర్వాత ఎవరు కొనుగోలు చేయకపోవడం పృథ్వీని మరింత నిరాశలోకి నెట్టింది.
తన పరిస్థితిపై పృథ్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ సందేశం పోస్ట్ చేసి, తన నమ్మకాన్ని ప్రదర్శించాడు. “నేను ఇంకా ఏమి చూడాలి? నా స్టాట్స్ తగినంత కాదు అనిపిస్తే, ఇంకా నేను పని చేస్తాను. దేవుడు, నాతో ఉన్నాడు, ప్రజలు నన్ను నమ్ముతారని నమ్ముతున్నాను. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను” అంటూ షా తన మనసులోని భావాలను పంచుకున్నాడు.
అయితే, పృథ్వీని జట్టులోంచి తొలగించడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) తన వైఖరిని క్లారిఫై చేసింది. MCA అధికారుల ప్రకారం, ప్రధాన కారణం ఫిట్‌నెస్ లోపమే. “పృథ్వీ ఫిట్‌నెస్ మీద పనిచేయాలి. అతని ప్రదర్శన, క్రమశిక్షణపై కూడా మరింత దృష్టి పెట్టాలి. ప్రస్తుతానికి, అతని శారీరక స్థితి చూడగానే ఫిట్‌నెస్ సమస్య స్పష్టమవుతుంది” అని MCA వర్గాలు వెల్లడించాయి.
MCA అంచనాల ప్రకారం, పృథ్వీ తిరిగి బలంగా ఆడగలిగే అవకాశముంది. “అతనిలో టాలెంట్ ఎంత గొప్పదో మాకు తెలుసు. ఇది అతను ఎంత హార్డ్ వర్క్ పెట్టగలడో దానిపైనే ఆధారపడి ఉంటుంది” అని వారు తెలిపారు.
పృథ్వీ షా, క్రికెట్ ప్రేమికులకు తాను తిరిగి వస్తానని నమ్మకాన్ని కల్పిస్తూ, తన ఆటలో మరింత కఠినంగా శ్రమించి, తిరిగి తన స్థానాన్ని సంపాదించడానికి కృషి చేస్తాడనే ఆశాభావం నెలకొంది.