
PAK vs NED T20 WC 2026 : కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్ అద్భుత విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో పాక్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒకానొక దశలో నెదర్లాండ్స్ విజయం ఖాయమని భావించినా, పాక్ ఆల్ రౌండర్ ఫహీమ్ అష్రఫ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో సీన్ మొత్తం రివర్స్ చేశాడు. 19వ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు పిండుకుని పాకిస్తాన్‌ను గెలుపు ముంగిట నిలబెట్టాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మైఖేల్ లెవిట్ (24), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (37) రాణించడంతో నెదర్లాండ్స్ ఒక దశలో పటిష్టంగా కనిపించింది. అయితే పాక్ బౌలర్ సల్మాన్ మీర్జా (3/24) అద్భుతమైన స్పెల్‌తో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. అబ్రార్ అహ్మద్, సామ్ అయూబ్, మొహమ్మద్ నవాజ్ తలో రెండు వికెట్లు తీసి నెదర్లాండ్స్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. చివరి 20 పరుగుల వ్యవధిలోనే డచ్ టీమ్ 6 వికెట్లు కోల్పోవడం గమనార్హం.
148 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ మొదట్లో తడబడింది. బాబర్ ఆజం (15), సామ్ అయూబ్ (24) త్వరగానే పెవిలియన్ చేరారు. సాహిబ్జాదా ఫర్హాన్ (47) పోరాడినా, మధ్యలో వరుసగా వికెట్లు పడటంతో పాక్ 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన స్థితిలో ఫహీమ్ అష్రఫ్ (11 బంతుల్లో 29) చెలరేగిపోయాడు. లోగాన్ వాన్ బీక్ వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 24 పరుగులు బాది మ్యాచ్‌ను పాక్ వైపు తిప్పేశాడు. ఆఖరి ఓవర్‌లో పాక్ 19.3 ఓవర్లకే లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..