
Salman Ali Agha : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కథ విషాదాంతమైంది. సూపర్-8 రౌండ్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ.. సెమీఫైనల్‌కు వెళ్లేందుకు కావాల్సిన రన్ రేట్ (కనీసం 64 పరుగుల తేడాతో గెలవాలి) సాధించలేక ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ వైఫల్యంతో పాక్ క్రికెట్ వర్గాల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు సొంత దేశపు జర్నలిస్టుల నుంచే చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పాక్ కెప్టెన్‌ను అవమానించినట్లు అర్థమవుతోంది.
ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చిన సల్మాన్ ఆఘాను అక్కడి జర్నలిస్టులు ఏమాత్రం కనికరించలేదు. ఒక విలేకరి ఏకంగా డమ్మీ కెప్టెన్ అని సంబోధిస్తూ మాటల తూటాలు పేల్చారు. “నీ అంతట నువ్వు కెప్టెన్సీ వదులుకుంటావా? లేక బోర్డు నిన్ను తొలగించే వరకు వెయిట్ చేస్తావా?” అంటూ ముఖం మీదే ప్రశ్నించారు. ఈ టోర్నీలో సల్మాన్ బ్యాటర్‌గా కూడా దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం టోర్నీలో అతను చేసిన పరుగులు కేవలం 60 మాత్రమే. నమీబియాపై చేసిన 38 పరుగులు మినహాయిస్తే, మిగతా మ్యాచ్‌ల్లో కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేక చతికిలపడ్డాడు. జట్టును విజయపథంలో నడిపించలేకపోవడమే కాకుండా వ్యక్తిగత ఫామ్ కూడా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
విలేకరుల దాడికి సల్మాన్ ఆఘా ఆచితూచి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. “ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది భావోద్వేగంతో కూడుకున్నది అవుతుంది. స్వదేశానికి వెళ్లి, కొంచెం సమయం తీసుకుని ఆలోచిస్తాం. మూడు నాలుగు రోజుల్లో భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాం” అని చెప్పుకొచ్చాడు. హెడ్ కోచ్ మైక్ హెసన్ నిన్ను ఒక డమ్మీ కెప్టెన్‌లా చూస్తున్నారన్న విమర్శలపై స్పందిస్తూ.. “నేను సమాధానం చెప్పకపోతే అది అవమానంగా భావిస్తారు. ఇది టీమ్ గేమ్. జట్టు నిర్ణయాలు అనేవి ఒకరిద్దరి చేతుల్లో ఉండవు, అందరం కలిసే తీసుకుంటాం” అని బదులిచ్చాడు.
ఈ టోర్నీలో పాకిస్థాన్ ప్రస్థానం చూస్తే.. నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లను ఓడించినా, భారత్, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్ల ముందు తేలిపోయింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం కూడా వారికి శాపంగా మారింది. వరుసగా నాలుగు ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ సెమీఫైనల్ చేరకపోవడం ఇదే మొదటిసారి. ఈ ఘోర పరాభవం నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డులో భారీ మార్పులు వచ్చేలా కనిపిస్తున్నాయి. కెప్టెన్‌తో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..