మరో వారం రోజుల్లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీ హంగామా.. హైదరాబాద్‌లో అప్పుడే షూరూ అయింది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇదిలా ఉండగా.. దాయాది జట్టు పాకిస్తాన్ తన వార్మప్ మ్యాచ్‌ను సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే న్యూజిలాండ్ జట్టులోని కొందరు ఆటగాళ్లు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకోగా.. మిగతా ప్లేయర్స్ బుధవారం నగరానికి చేరుకోనున్నారు. ఇక ఆలస్యంగా వీసాలు అందుకున్న పాకిస్తాన్ ప్లేయర్స్ దుబాయ్ మీదుగా బుధవారం రాత్రి 8.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న పార్క్ హయత్ హోటల్‌లో పాక్ జట్టు వసతిని కల్పించగా.. న్యూజిలాండ్ జట్టుకు ఐటీసీ కాకతీయలో బసను ఏర్పాటు చేశారు. వాస్తవానికి సెప్టెంబర్ 27న పాక్ జట్టు హైదరాబాద్ చేరుకోవాలి. కానీ పాక్ క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి వీసాలు లేట్ కావడంతో.. హైదరాబాద్‌కు వారి రాక ఆలస్యమైంది.
సుమారు 15 రోజుల పాటు పాకిస్తాన్ జట్టు హైదరాబాద్‌లో ఉండనుంది. సెప్టెంబర్ 29న పాకిస్తాన్ తన మొదటి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలబడనుండగా.. ఆ తర్వాత అక్టోబర్ 3న ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇక ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మూడు ప్రధాన మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనున్నాయి. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్, అక్టోబర్ 9న కివీస్‌తో నెదర్లాండ్స్, అక్టోబర్ 10న శ్రీలంకతో పాకిస్తాన్ రాజీవ్ గాంధీ స్టేడియంలో తలబడనున్నాయి.
సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు మొదటిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫ్యాన్స్‌కు టికెట్లు అమ్మేసింది. అయితే గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకేసారి ఉండటంతో.. హైదరాబాద్ పోలీసులు మ్యాచ్‌కు తగిన భద్రత ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో అమ్మిన టికెట్లకు డబ్బులు వాపస్ ఇవ్వనుంది HCA. అలాగే ఈ వార్మప్ మ్యాచ్‌ను ఫ్యాన్స్ లేకుండానే క్లోజ్డ్ డోర్స్‌లోనే నిర్వహించనుంది.
అటు హైదరాబాద్ వేదికగా వార్మప్ మ్యాచ్‌తో పాటు వరల్డ్‌కప్‌లోనే ప్రధాన మ్యాచ్‌లు ఆడే జట్లైన ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, శ్రీలంక జట్లకు కూడా బసను ఏర్పాటు చేసింది బీసీసీఐ. తాజ్ కృష్ణాలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లకు.. నోవాటెల్ ఎయిర్‌పోర్ట్ హోటల్‌లో శ్రీలంక జట్లకు వసతిని ఏర్పాటు చేశారు బీసీసీఐ అధికారులు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..