
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్మాట్‌గా టీ20 క్రికెట్ కొనసాగుతున్నప్పటికీ, 2007లో జరిగిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభ దశలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వెల్లడించారు. ఆ సమయంలో భారత జట్టులోని పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ కొత్త ఫార్మాట్‌ను పెద్దగా పట్టించుకోలేదని, టోర్నమెంట్‌లో పాల్గొనడానికి కూడా ఆసక్తి చూపలేదని ఆయన పేర్కొన్నారు. లలిత్ మోదీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2007లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలో తాను డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని కోరినట్లు, ఒక రకంగా వారిడి అడుక్కున్నట్లు చెప్పారు. అయితే చాలా మంది ఆటగాళ్లు ఆ ఫార్మాట్‌ను సీరియస్‌గా తీసుకోలేదని ఆయన వెల్లడించారు. టీ20 ఏంటీ? ఇదొక స్టుపిడ్ గేమ్ అంటూ స్టార్ ప్లేయర్లు సచిన్, ద్రవిడ్, గంగూలీ చెప్పినట్లు లలిత్ మోదీ వెల్లడించారు.
ఆ సమయంలో భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌కు దూరంగా ఉండగా, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపిందన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని ఆ జట్టులో యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఆర్‌పీ సింగ్ వంటి ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అప్పట్లో అలా మెయిన్ టీమ్‌ను కాదని బీ టీమ్‌ను బీసీసీఐ పంపిందని, నేటి పరిస్థితుల్లో ఏ ప్రపంచకప్‌కైనా ‘బి’ జట్టును పంపడం ఊహించలేని విషయమని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్‌లో టీ20 క్రికెట్‌కు ప్రారంభంలో పెద్దగా ఆదరణ లేకపోయిందని కూడా మోదీ తెలిపారు. ప్రేక్షకుల ఆసక్తి లేకపోవడంతో ప్రసారకర్తలు, ప్రకటనదారులు కూడా ఈ ఫార్మాట్‌పై పెద్దగా నమ్మకం చూపలేదన్నారు. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఆ ఘటనతో టీ20 ప్రపంచకప్‌కు భారీ స్థాయిలో గుర్తింపు లభించిందని, ఆ ఫార్మాట్‌పై ప్రజల అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయిందని పేర్కొన్నారు. తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సాధించిన విజయం తర్వాతే టీ20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగిందని, అదే విజయంతో తరువాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి మెగా టోర్నీలకు బలమైన పునాది పడిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి