
జూన్ 23.. టీమిండియా ఫ్యాన్స్‌కు గుర్తుండిపోయే రోజు. సరిగ్గా ఏడాది క్రితం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కోహ్లీసేన.. న్యూజిలాండ్ చేతుల్లో పరాజయం పాలైంది. దీనితో కివీస్ జట్టు తొలిసారిగా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని గెలిచి రికార్డు సృష్టించింది. జూన్ 18 – 23 మధ్య సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగింది. అప్పుడు టీమిండియాకు విరాట్ కోహ్లీ సారధ్యం వహిస్తుండగా.. న్యూజిలాండ్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ బరిలోకి దిగాడు.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. తొలుత భారత్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఇక కివీస్ బౌలర్ జమీసన్(5 వికెట్లు) దెబ్బకు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ అయింది. అజింక్య రహానే 49 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అటు షమీ(4 వికెట్లు) పదునైన బంతులకు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు వెనుకబడి ఉన్న భారత్.. రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. కివీస్ పేస్ త్రయం సౌథీ(4 వికెట్లు), బౌల్ట్(3 వికెట్లు), జమీసన్(2 వికెట్లు) యార్కర్లకు టీమిండియా 170 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇంకేముంది న్యూజిలాండ్‌కు 139 పరుగుల టార్గెట్ నిర్దేశించబడింది. రెండు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని కివీస్ సునాయాసంగా చేధించింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 89 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో అజేయంగా 52 పరుగులు చేయగా.. రాస్ టేలర్ 100 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా, ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీతో దాదాపు 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ టోర్నీని న్యూజిలాండ్ గెలుచుకుంది.