
Super Smash 2024: న్యూజిలాండ్‌లో జరుగుతున్న సూపర్ స్మాష్ T20 లీగ్‌లో 22వ మ్యాచ్‌లో, లోగాన్ వాన్ బీక్ ఒక ఓవర్‌లో పూర్తి కాకుండానే అంటే కేవలం 5 బంతుల్లోనే 33 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో బౌలింగ్ గణాంకాల మేరకు చెత్త రికార్డును నమోదు చేశాడు. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. కానీ వెల్లింగ్టన్ జట్టు ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయింది.
72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వెల్లింగ్టన్ జట్టుకు మహ్మద్ అబ్బాస్ (35) ఆసరాగా నిలిచాడు. అలాగే చివరి ఓవర్ల సమయంలో చెలరేగిన లోగన్ వాన్ బీక్ 24 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. దీంతో వెల్లింగ్టన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టు 16 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. చివరి 30 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో వాన్ బీక్ ఖరీదైన వాడిగా మారాడు.
నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న వాన్ బీక్ తొలి మూడు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో కెప్టెన్ నిక్ కెల్లీ అతనిపై విశ్వాసం వ్యక్తం ఉంచాడు. 17వ ఓవర్ బంతిని అతనికి ఇచ్చాడు. తొలి బంతికి వాన్ బీక్ బౌలింగ్ లో వైడ్‌గా మొదలుపెట్టాడు. బంతి వికెట్ కీపర్‌కు చిక్కకుండా బౌండరీ లైన్ దాటింది. దీంతో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టు ఒక్క బంతికి 5 పరుగులు చేసింది. రీ-బాల్‌లో బ్రేస్‌వెల్ 1 పరుగు చేశాడు. 2వ బంతికి టామ్ బ్రూస్ 1 పరుగు సాధించాడు.
3వ బంతి వైడ్. నో బాల్ అయిన రీ బాల్‌లో బ్రేస్‌వెల్ భారీ సిక్సర్ బాదాడు. అతను ఫ్రీ హిట్ డెలివరీలో లాంగ్ ఆఫ్ దిశగా సిక్సర్ కొట్టాడు. 4వ బంతికి బ్రేస్‌వెల్ డీప్ మిడ్ వికెట్ మీదుగా మరో సిక్స్ బాదాడు. 5వ బంతికి బ్రేస్‌వెల్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
దీంతో పాటు కేవలం 5 బంతుల్లోనే 33 పరుగుల పేలవమైన రికార్డు లోగాన్ వాన్ బీక్ పేరుతో వచ్చి చేరింది. ఈసారి సూపర్ స్మాష్ లీగ్‌లో లోగాన్ చెత్త బౌలింగ్ రికార్డును నమోదు చేసుకున్నాడు.
వెల్లింగ్టన్ ప్లేయింగ్ 11: నిక్ గ్రీన్‌వుడ్, ట్రాయ్ జాన్సన్, నిక్ కెల్లీ (కెప్టెన్), ముహమ్మద్ అబ్బాస్, జెస్సీ తాష్‌కాఫ్, కల్లమ్ మెక్‌లాచ్లాన్ (వికెట్ కీపర్), నాథన్ స్మిత్, లోగాన్ వాన్ బీక్, పీటర్ యంగ్‌హస్‌బాండ్, ఇయాన్ మెక్‌పీక్, మైఖేల్ స్నెడెన్.
సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ప్లేయింగ్ 11: విల్ యంగ్, జాక్ బాయిల్, డేన్ క్లీవర్ (వికెట్ కీపర్), టామ్ బ్రూస్ (కెప్టెన్), డగ్ బ్రేస్‌వెల్, విలియం క్లార్క్, బెవాన్ స్మాల్, జోయ్ ఫీల్డ్, అజాజ్ పటేల్, బ్లెయిర్ టిక్నర్, జేడెన్ లెనాక్స్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..