స్మిత్‌ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన మరో సీనియర్‌ క్రికెటర్‌!

బంగ్లాదేశ్‌ సీనియర్‌ క్రికెటర్‌ ముష్ఫికర్‌ రహీం వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ జీవితం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల్లో 7795 పరుగులు, 243 క్యాచ్‌లు, 56 స్టంపింగ్‌లతో అతని కెరీర్‌ సక్సెస్ ఫుల్ గానే సాగింది. తనకు అండగా నిలిచిన తన అభిమానులకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.

స్మిత్‌ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన మరో సీనియర్‌ క్రికెటర్‌!
Mushfiqur Rahim

Updated on: Mar 06, 2025 | 6:45 AM

ఇటీవలె ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత స్మిత్‌ తన నిర్ణయాన్ని ప్రకటించి అందర్ని షాక్‌కు గురి చేశాడు. ఇప్పుడు స్మిత్‌ బాటలోనే మరో సీనియర్‌ ప్లేయర్‌ కూడా అడుగులు వేశాడు. బంగ్లాదేశ్ వెటరన్ వికెట్ కీపర్, బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ బుధవారం వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. “నేను ఈరోజు నుంచి వన్డే ఫార్మాట్ నుండి రిటైర్‌ అవుతున్నాను. ఇప్పటి వరకు నా కెరీర్‌లో దక్కిన ప్రతి దానికి ఆ దేవుడికి కృతజ్ఞతలు(అల్హమ్దులిల్లాహ్). ప్రపంచ స్థాయిలో మన(బంగ్లాదేశ్‌) విజయాలు పరిమితం అయినప్పటికీ, ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను, నేను నా దేశం కోసం మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా, అంకితభావం, నిజాయితీతో 100 శాతం కంటే ఎక్కువే ఇచ్చాను” అని ముష్ఫికర్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చాడు.

“గత కొన్ని వారాలు నాకు చాలా సవాలుగా మారాయి. రిటైర్మెంట్‌కు ఇదే మంచి సమయం అని భావిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్‌లో ఇలా అన్నారు.. “వా తు’ఇజ్జు మన్ తషా’ వ తు’జిలు మన్ తషా'”(అతను కోరిన వారిని గౌరవిస్తాడు, అతను కోరిన వారిని అవమానిస్తాడు) సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనల్ని క్షమించి అందరికీ ధర్మబద్ధమైన విశ్వాసాన్ని ప్రసాదించుగాక” అని ముష్ఫికర్‌ పేర్కొన్నాడు. “నేను గత 19 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాను. నాకు అండగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులు, నా అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇక ముష్ఫికర్‌ ఆగస్టు 2006లో జిమాబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వన్డే ఫార్మాట్‌లో 274 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 36.42 సగటుతో 7,795 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి. కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు 144. వికెట్ కీపర్‌గా 243 క్యాచ్‌లు అందుకున్నాడు. అలాగే 56 స్టంపింగ్‌లు చేశాడు. బంగ్లాదేశ్‌ పరంగా చూసుకుంటే.. ముష్ఫికర్‌ ఒక సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గానే తన కెరీర్‌ను ముగించాడు.