
World Cup : భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రెండు వన్డే ప్రపంచకప్ విజయాల మధ్య 14 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ ఉంది. 2011లో పురుషుల జట్టు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో గెలిస్తే, 2025లో మహిళా జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ 14 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పటికీ ఈ రెండు ప్రపంచకప్ ఫైనల్స్ మ్యాచ్‌లలో ఐదు అద్భుతమైన పోలికలు ఉన్నాయి. ఆ యాదృచ్ఛిక సంఘటనలేంటో, ఛాంపియన్ల తయారీలో ఈ సంఖ్యల మాయ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫైనల్‌కు సాక్ష్యంగా నిలిచిన ముంబై నగరం
ఈ రెండు ప్రపంచకప్ ఫైనల్స్ మ్యాచ్‌లకు వేదికగా ఒకే నగరం నిలవడం మొదటి అద్భుతమైన యాదృచ్ఛికం. 2011లో పురుషుల ప్రపంచకప్ ఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. అలాగే, 2025లో మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది. వేదికలు వేరైనా, ఫైనల్‌కు సాక్ష్యం పలికింది మాత్రం ముంబై నగరమే.
ఫైనల్ మ్యాచ్ తేదీల్లో 2 కామన్ పాయింట్
రెండు ప్రపంచకప్ ఫైనల్స్ తేదీల్లో ఆశ్చర్యకరమైన పోలిక ఉంది. 2011లో పురుషుల వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఏప్రిల్ 2న జరిగింది. అదే విధంగా, 2025 మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్ నవంబర్ 2న జరిగింది. రెండు మ్యాచ్‌ల తేదీల్లో 2 అంకె కామన్ గా ఉండటం గమనార్హం.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఆల్ రౌండర్లే
రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఒక ఆల్ రౌండర్‌కే దక్కింది. 2011 పురుషుల వన్డే ప్రపంచకప్‌లో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ టోర్నమెంట్ అంతా అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికయ్యారు. అదే విధంగా, 2025 మహిళా ప్రపంచకప్‌లో ఆల్ రౌండర్ దీప్తి శర్మ అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కిరీటాన్ని గెలుచుకుంది.
కెప్టెన్ చేతుల్లోనే మ్యాచ్ ముగింపు
రెండు ప్రపంచకప్‌లలో మ్యాచ్ ముగింపు భారత కెప్టెన్ల చేతుల్లోనే జరగడం మరో అరుదైన పోలిక. 2011 పురుషుల ప్రపంచకప్ ఫైనల్‌లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ముగించి, భారత్‌ను విజేతగా నిలిపారు. 2025 మహిళా ప్రపంచకప్ ఫైనల్‌లో చివరి వికెట్ పడటానికి కారణమైన అద్భుతమైన క్యాచ్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందుకున్నారు. ఆ క్యాచ్‌తోనే భారత జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
మూడవ ఫైనల్‌లోనే టైటిల్ విజయం
రెండు భారత జట్లు కూడా తమ మూడవ ప్రపంచకప్ ఫైనల్‌లో విజయం సాధించడం మరో ఆసక్తికరమైన అంశం. భారత పురుషుల జట్టు 1983 మరియు 2003లో ఫైనల్ ఆడి, 2011లో మూడవ ప్రయత్నంలో టైటిల్‌ను గెలిచింది. భారత మహిళా జట్టు కూడా 2005, 2017లో ఫైనల్ ఆడి 2025లో తమ మూడవ ప్రపంచకప్ ఫైనల్‌లో విజయం సాధించింది.