
Mumbai Indians : ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్ అభిమానులకు ఒక పీడకలలా మిగిలిపోయింది. కాగితం మీద చూస్తే బుమ్రా, రోహిత్, సూర్యకుమార్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఎంతో పటిష్టంగా కనిపించిన ముంబై జట్టు, మైదానంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. టోర్నీ ప్రారంభానికి ముందే హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ టీమ్, లీగ్ దశ ముగియడానికి రెండు వారాల ముందే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. దీనికి తోడు జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం ముంబై లీగ్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.
ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణం కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు దుమ్మెత్తిపోస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జోష్‌లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన హార్దిక్, ఇటు కెప్టెన్‌గానూ, అటు ఆటగాడిగానూ చేతులెత్తేశాడు. వెన్నునొప్పి సమస్య అతని ఆటను దెబ్బతీసిన మాట వాస్తవమే అయినా, మైదానంలో అతను తీసుకున్న కొన్ని విచిత్రమైన నిర్ణయాలు, బౌలింగ్ మార్పులు జట్టును నష్టపరిచాయి. ఒత్తిడిని తట్టుకోలేక హార్దిక్ పూర్తిగా చేతులెత్తేయడం, కీలక సమయాల్లో బాధ్యతారాహిత్యంగా ఆడటం ముంబైని ముంచేసింది. 10 మ్యాచ్‌ల్లో కేవలం 206 పరుగులు చేసి, బౌలింగ్‌లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఎకానమీ కూడా దాదాపు 12కు చేరుకోవడంతో హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శన అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓటమి తర్వాత ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. హార్దిక్ కెప్టెన్సీ భవిష్యత్తు గురించి పోలార్డ్‌ను ప్రశ్నించగా.. “మేము అనుకున్నట్లు ఈ సీజన్ సాగలేదు. 12 నెలల క్రితం మూడో స్థానంలో ఉన్నాము. ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉన్నాము. ఇలాంటి నిలకడలేని ప్రదర్శనల గురించి ఖచ్చితంగా చర్చించాలి. మేనేజ్‌మెంట్ అంతా కూర్చుని, మా తప్పులను సరిదిద్దుకుని 10 నెలల తర్వాత మరింత బలంగా తిరిగి వస్తాము” అంటూ వ్యాఖ్యానించాడు. పోలార్డ్ ఎక్కడా హార్దిక్‌ను సమర్థించకపోవడం చూస్తుంటే, వచ్చే సీజన్‌కల్లా ముంబై టీమ్‌లో కొత్త కెప్టెన్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఒకప్పుడు తిరుగులేని జట్టుగా ఉండేది. కానీ 2020లో ఐదోసారి టైటిల్ గెలిచిన తర్వాత, గత ఐదేళ్లలో ఏకంగా మూడు సార్లు లీగ్ దశలోనే 10 మ్యాచ్‌లు ఓడిపోవడం ఫ్యాన్స్‌కు అస్సలు మింగుడుపడటం లేదు. విశేషం ఏంటంటే, ఇందులో రెండు సార్లు (2024, 2026) హార్దిక్ పాండ్యా నాయకత్వంలోనే ముంబై ఈ అవమానాన్ని ఎదుర్కొంది. 2022లో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించి సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న హార్దిక్, ముంబైకి వచ్చేసరికి పూర్తిగా క్లూలెస్‌గా మారిపోయాడు. అందుకే హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ భారం నుంచి తప్పించి, అతను కేవలం బ్యాటింగ్, బౌలింగ్‌లపైనే దృష్టి పెట్టేలా చేస్తేనే జట్టుకు మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..