
టెస్టు క్రికెట్ అంటేనే ఓపికకు, సాంకేతికతకు పరీక్ష అని అందరూ భావిస్తారు. కానీ ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ బ్యాటర్లు విధ్వంసకర శైలిలో విరుచుకుపడి ఒక్క ఓవర్‌లోనే పరుగుల వరద పారించిన సందర్భాలు ఉన్నాయి. టెస్టు చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన టాప్ 5 దిగ్గజాల జాబితా క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, టెస్టు క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఏ దిగ్గజ బ్యాటర్ పేరిటో లేదు. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఈ అరుదైన ప్రపంచ రికార్డు నమోదైంది. 2022లో ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను బుమ్రా పూర్తిగా ఉతికి ఆరేశారు. ఆ ఓవర్‌లో 4 నో బాల్స్, 5 వైడ్స్, 7 (నో బాల్ తో కలిపి సిక్స్), 4, 4, 4, 6, 1 రూపంలో ఏకంగా 35 పరుగులు వచ్చాయి. ఇందులో బుమ్రా బ్యాట్ నుంచి 29 పరుగులు రాగా, మిగిలినవి ఎక్స్‌ట్రాల ద్వారా లభించాయి. ఈ మైండ్ బ్లోయింగ్ రికార్డును చెరిపివేయడం ఏ బౌలర్‌కైనా దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
వెస్టిండీస్ లెజెండరీ బ్యాటర్ బ్రయాన్ లారా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 2003-04 సీజన్‌లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లారా ఈ వినాశకర ఇన్నింగ్స్ ఆడారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ రాబిన్ పీటర్సన్ వేసిన ఒకే ఓవర్‌లో లారా 4, 6, 6, 4, 4, 4 కొట్టి ఏకంగా 28 పరుగులు పిండుకున్నారు. పద్దెనిమిదేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉన్న ఈ ప్రపంచ రికార్డును ఆ తర్వాత బుమ్రా తిరగరాశారు.
ఆస్ట్రేలియా ధాటికైన బ్యాటర్ జార్జ్ బెయిలీ కూడా లారా సరసన నిలిచారు. 2013-14 యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌పై బెయిలీ విరుచుకుపడ్డారు. ఒకే ఓవర్‌లో 28 పరుగులు (4, 6, 2, 4, 6, 6) సాధించి ఆండర్సన్ బౌలింగ్ గణాంకాలను దెబ్బతీశారు. అనుభవజ్ఞుడైన బౌలర్‌పై బెయిలీ సాధించిన ఈ అరుదైన రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.
దక్షిణాఫ్రికా స్పిన్నర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్ కేశవ్ మహారాజ్ సైతం టెస్టుల్లో ఒకే ఓవర్‌లో 28 పరుగులు చేసిన ఘనత సాధించారు. 2019-20లో ఇంగ్లాండ్‌తో జరిగిన పోర్ట్ ఎలిజబెత్ టెస్టులో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ బౌలింగ్‌ను కేశవ్ మహారాజ్ టార్గెట్ చేశారు. రూట్ వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 6, 6 బౌండరీలతో పాటు బైస్ ద్వారా మరో 4 పరుగులు రాబట్టి మొత్తం 28 పరుగులు నమోదు చేశారు.
పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది తన విధ్వంసకర బ్యాటింగ్‌కు పేరుగాంచారు. 2005-06లో లాహోర్ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అఫ్రిది విరుచుకుపడ్డారు. భారత అగ్రశ్రేణి స్పిన్నర్ హర్భజన్ సింగ్ వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది ఆ తర్వాత 2, 1 పరుగులు చేసి మొత్తం 27 పరుగులు పిండుకున్నారు. టెస్టుల్లో అత్యంత వేగంగా ఆడే ఆటగాడిగా తన ముద్రను అఫ్రిది ఈ ఓవర్‌తో మరోసారి నిరూపించారు.