Year Ender 2025: ఈ ఏడాది టీమిండియా తోపు ప్లేయర్ ఇతనే.. కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టేశాడుగా..

Most Hundred For India In 2025: 26 ఏళ్ల బ్యాట్స్‌మన్ 2025లో టీమ్ ఇండియా తరపున అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఆటగాడు క్యాలెండర్ సంవత్సరంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే రెండు రెట్లు ఎక్కువ సెంచరీలు చేశాడు.

Year Ender 2025: ఈ ఏడాది టీమిండియా తోపు ప్లేయర్ ఇతనే.. కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టేశాడుగా..
Team India

Updated on: Dec 25, 2025 | 11:43 AM

Most Hundred For India In 2025: భారత క్రికెట్ చరిత్రలో 2025 ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం నుంచి ఆసియా కప్ వరకు టీమిండియా అప్రతిహత విజయాలను అందుకుంది. అయితే ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించింది మాత్రం భారత బ్యాటర్ల అద్భుతమైన సెంచరీలే. ముఖ్యంగా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను వెనక్కి నెట్టి యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది పరుగుల రారాజుగా నిలిచాడు.

1. శుభ్‌మన్ గిల్ – 7 సెంచరీలు 2025లో భారత జట్టు తరపున అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. మూడు ఫార్మాట్లు కలిపి గిల్ మొత్తం 7 సెంచరీలు సాధించాడు. ఇందులో అత్యధికంగా టెస్టుల్లో 5 సెంచరీలు ఉండగా, వన్డేల్లో 2 సెంచరీలు ఉన్నాయి. గిల్ ఈ ఏడాది ఇంగ్లాండ్‌పై ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు (161, 269) చేసి రికార్డు సృష్టించాడు.

2. యశస్వి జైస్వాల్ – 4 సెంచరీలు మరో యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఈ ఏడాది 4 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించడమే కాకుండా, 2025లో తన వన్డే కెరీర్‌లో మొదటి సెంచరీని కూడా నమోదు చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

3. విరాట్ కోహ్లీ – 3 సెంచరీలు కింగ్ కోహ్లీ ఈ ఏడాది టీ20ల నుంచి తప్పుకున్నప్పటికీ, వన్డే ఫార్మాట్‌లో తన విశ్వరూపాన్ని చూపించాడు. మొత్తం 3 అంతర్జాతీయ సెంచరీలు (అన్నీ వన్డేలే) సాధించి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తన 52వ వన్డే సెంచరీ బాది, సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.

4. కేఎల్ రాహుల్ – 3 సెంచరీలు గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ కూడా ఈ ఏడాది తన సత్తా చాటాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి మొత్తం 3 సెంచరీలు బాది నాలుగో స్థానంలో నిలిచాడు.

5. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ – 2 సెంచరీలు టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ మరియు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చెరో 2 సెంచరీలతో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. రోహిత్ తన అనుభవంతో జట్టుకు అండగా నిలవగా, పంత్ టెస్టుల్లో తన దూకుడైన ఆటతీరుతో శతకాలు సాధించాడు.

మొత్తానికి 2025 సంవత్సరం శుభ్‌మన్ గిల్ కెరీర్‌లో అత్యుత్తమ ఏడాదిగా నిలిచింది. ఒకవైపు టెస్టులు, వన్డేల్లో పరుగుల వరద పారించిన గిల్, మరోవైపు టీ20 ఫార్మాట్‌లో మాత్రం ఫామ్ లేమితో జట్టులో చోటు కోల్పోయాడు. అయినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్, విరాట్‌ల వారసుడిగా గిల్ తన ముద్ర వేయడంలో విజయవంతమయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..