Mohammed Shami : నెలకు రూ.4 లక్షలు సరిపోవట్లేదు.. రూ.10లక్షలు కావాలి..సుప్రీంకోర్టును కోరిన షమీ భార్య

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మళ్లీ వార్తల్లోకెక్కారు. అయితే ఈసారి క్రికెట్ మైదానంలో అతని ప్రదర్శన వల్ల కాదు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం కారణంగా. షమీకి దూరంగా ఉంటున్న అతని భార్య హసీన్ జహాన్ తనకు, తమ కుమార్తెకు ఇచ్చే భరణం మొత్తాన్ని పెంచాలంటూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.

Mohammed Shami : నెలకు రూ.4 లక్షలు సరిపోవట్లేదు.. రూ.10లక్షలు కావాలి..సుప్రీంకోర్టును కోరిన షమీ భార్య
Mohammed Shamis Wife Hasin Jahan

Updated on: Nov 07, 2025 | 5:01 PM

Mohammed Shami : టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మళ్లీ వార్తల్లోకెక్కారు. అయితే ఈసారి క్రికెట్ మైదానంలో అతని ప్రదర్శన వల్ల కాదు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం కారణంగా. షమీకి దూరంగా ఉంటున్న అతని భార్య హసీన్ జహాన్ తనకు, తమ కుమార్తెకు ఇచ్చే భరణం మొత్తాన్ని పెంచాలంటూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు నెలకు రూ.4 లక్షల భరణం ఇవ్వాలని ఆదేశించగా, దాన్ని రూ.10 లక్షలకు పెంచాలని హసీన్ జహాన్ కోరుతోంది. ఈ అప్పీల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు హసీన్ జహాన్‌ను, ఆమె న్యాయవాదులను ఒక కీలకమైన ప్రశ్న అడిగింది.

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, అతని భార్య హసీన్ జహాన్ గత ఏడు సంవత్సరాలుగా (2018 నుంచి) వేర్వేరుగా ఉంటున్నారు. 2018లోనే హసీన్ జహాన్, షమీ, అతని కుటుంబ సభ్యులపై గృహహింస, వేధింపుల ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ వివాదం కోర్టుల పరిధిలో ఉంది. ప్రారంభంలో ఒక ట్రయల్ కోర్టు షమీని నెలకు రూ.1.3 లక్షల మధ్యంతర భరణం చెల్లించాలని ఆదేశించింది. అయితే, 2025 జూలైలో కలకత్తా హైకోర్టు ఈ మొత్తాన్ని నెలకు రూ.4 లక్షలకు పెంచింది. ఇందులో రూ.1.5 లక్షలు హసీన్ జహాన్‌కు, మిగిలిన రూ.2.50 లక్షలు వారి కుమార్తెకు కేటాయించారు.

హసీన్ జహాన్ కలకత్తా హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తనకు, కుమార్తెకు కలిపి మధ్యంతర భరణాన్ని నెలకు రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఆమె మొదట్నుంచీ రూ.7 లక్షలు తన కోసం, రూ.3 లక్షలు కుమార్తె కోసం కోరుతోంది. సుప్రీంకోర్టులో చేసిన అప్పీల్‌లో హసీన్ జహాన్, భరణం పెంపునకు గల కారణాలను ప్రముఖంగా ప్రస్తావించింది. షమీ ఏ-లిస్టెడ్ నేషనల్ క్రికెటర్ అని, అతని నికర విలువ దాదాపు రూ.500 కోట్లు ఉంటుందని హసీన్ జహాన్ కోర్టుకు తెలిపింది.

క్రికెటర్, బాధితురాలి జీవన ప్రమాణాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఈ భరణం తమ జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి సరిపోదని ఆమె వాదించింది. ఇతర ఎలైట్ క్రికెటర్ల కుటుంబాల మాదిరిగానే తాము కూడా అదే స్థాయిలో జీవించే హక్కు ఉందని, అయితే షమీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని ఆరోపించింది. ఈ అప్పీల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం హసీన్ జహాన్‌ను, ఆమె న్యాయవాదులను ప్రశ్నించింది.

జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం హసీన్ జహాన్ న్యాయవాదులను ఉద్దేశించి.. “నెలకు రూ.4 లక్షలు భరణం కూడా బాధితురాలికి సరిపోదా?” అని ప్రశ్నించింది. హసీన్ జహాన్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రస్తుతం ఎలాంటి తుది ఆదేశాలు ఇవ్వనప్పటికీ, ఈ కేసుపై మరింత విచారణ జరిపేందుకు మహ్మద్ షమీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల తర్వాత తదుపరి విచారణ కొనసాగనుంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..