Ind vs Aus: టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు రోహిత్ పాటు ఆ స్టార్ పేసర్..
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాకు కెప్టెన్ రోహిత్‌తో పాటు ఓ స్టార్ పేసర్ కూడా బయలుదేరుతున్నాడు. తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ భాగమవుతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే రెండో మ్యాచ్‌లో ఆడడం దాదాపు ఖాయమని తెలుస్తుంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి పెర్త్‌లో ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ మినహా టీమిండియా ప్లేయర్లందరూ ఆస్ట్రేలియాలో ఉన్నారు. టీమిండియా ప్లేయర్లందరూ ఈ సిరీస్ కోసం తీవ్రంగా సిద్ధమవుతున్నారు. రోహిత్ తన కూమారుడు పుట్టిన సందర్భంగా విరామం తీసుకున్నాడు. అతని భార్య రితికా సజ్దే నవంబర్ 15 అర్థరాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ త్వరలో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు. అయితే అతడితో పాటు జట్టులో లేని మరో ఆటగాడు ఆస్ట్రేలియా వెళ్లడం విశేషం.
తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ భాగమవుతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే రెండో మ్యాచ్‌లో ఆడడం దాదాపు ఖాయం. మీడియా నివేదికల ప్రకారం, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా రోహిత్ శర్మతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరుతారు. ఏడాది తర్వాత షమీ ఇటీవలే మైదానంలోకి వచ్చాడు. రంజీ ట్రోఫీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత షమీ కూడా చాలా మంచి ఫామ్‌లో కనిపించాడు. అయితే అతను జట్టులో చేరడంపై ఫస్ట్ మ్యాచ్ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోబడుతుంది. అంటే సిరీస్‌లో రెండో మ్యాచ్‌కి ముందే అతడిని జట్టులోకి తీసుకోవచ్చు.
2023 వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి గాయం కారణంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో అతను చీలమండ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాస శిబిరంలో ఉన్నాడు. ఇటీవల, బెంగాల్ జట్టుకు ఆడుతున్న అతను రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో ఆడాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 54 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ షమీ 18 ఓవర్లలో 74 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. NCA ఫిజియో నితిన్ పటేల్ సలహా తర్వాతే షమీపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు, షమీ ఫిట్‌నెస్‌పై బెంగాల్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా మాట్లాడుతూ.. ‘మహ్మద్ షమీ ఆటకు సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను చాలా బాగా కనిపించాడు. అతను రెండు ఇన్నింగ్స్‌లలో 44 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఎప్పుడూ ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కోలేదు’ చెప్పుకొచ్చాడు.