
Mohammad Rizwan: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మరోసారి కెప్టెన్సీ మార్పు వివాదాస్పదంగా మారింది. ఇటీవల మహ్మద్ రిజ్వాన్‌ను (Mohammad Rizwan) వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, అతని స్థానంలో షాహీన్ షా అఫ్రిదిని (Shaheen Shah Afridi) నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయం కేవలం పేలవమైన ప్రదర్శన కారణంగా తీసుకోలేదని, డ్రెస్సింగ్ రూమ్‌లో రిజ్వాన్ మతపరమైన ‘సంస్కృతి’ని ఎక్కువగా ప్రోత్సహించడం కూడా ఒక కారణంగా ఉందని మాజీ పాకిస్తాన్ క్రికెటర్ రషీద్ లతీఫ్ (Rashid Latif) సంచలన ఆరోపణలు చేశారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రిజ్వాన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడానికి ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ (Mike Hesson) కారణమని ఆరోపించారు. లతీఫ్ ప్రకారం, కోచ్ మైక్ హెస్సన్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో రిజ్వాన్ ప్రచారం చేస్తున్న మతపరమైన ఆచారాలు, సంస్కృతి నచ్చలేదు. “ఆ సంస్కృతిని డ్రెస్సింగ్ రూమ్ నుంచి తొలగించాలని హెస్సన్ కోరుకుంటున్నాడు” అని లతీఫ్ పేర్కొనడం గమనార్హం.
గాజా-ఇజ్రాయెల్ సంఘర్షణ సమయంలో రిజ్వాన్ బహిరంగంగా పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం కూడా అతని తొలగింపునకు ఒక కారణమని లతీఫ్ అన్నారు. “కేవలం పాలస్తీనా జెండాను పట్టుకున్నందుకే కెప్టెన్ పదవి నుంచి తొలగిస్తారా?” అని ఆయన ప్రశ్నించారు. మహ్మద్ రిజ్వాన్ ఆటతో పాటు తన మత విశ్వాసాలను బహిరంగంగా వ్యక్తం చేస్తారనే విషయం తెలిసిందే. జట్టులోని సభ్యులు కూడా మతపరమైన ఆచారాలను పాటించేలా రిజ్వాన్ ప్రోత్సహించేవారని పలు నివేదికలు చెబుతున్నాయి.
పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇమామ్-ఉల్-హక్ (Imam-ul-Haq) గతంలో ఒక ఇంటర్వ్యూలో రిజ్వాన్ నాయకత్వ శైలి గురించి మాట్లాడుతూ, రిజ్వాన్ హోటల్ గదుల్లో ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని, నమాజ్ సమయాల కోసం వాట్సాప్ గ్రూపులు సృష్టిస్తారని, నమాజ్ గదిలోకి ముస్లిమేతరులను అనుమతించరని వెల్లడించారు. మాజీ పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ (Ahmed Shehzad) కూడా రిజ్వాన్‌ను లక్ష్యంగా చేసుకుని, పేలవమైన ప్రదర్శనను కప్పిపుచ్చుకోవడానికి ‘మతపరమైన కార్డు’ను ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రిజ్వాన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడానికి అధికారికంగా ఎటువంటి కారణాన్ని ప్రకటించలేదు. చాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025)లో జట్టు పేలవ ప్రదర్శన (గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించడం)తోపాటు కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లలో ఓటమి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది. సెలక్షన్ కమిటీ, వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌ల సమావేశం తర్వాత ఈ కెప్టెన్సీ మార్పు జరిగిందని ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
రిజ్వాన్ స్థానంలో పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదిని వన్డే కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రిజ్వాన్ మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..