Rohit Sharma : అతన్ని తొలగించే దమ్ము సెలెక్టర్లకు ఉందా?.. రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు

Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ ఉంటాడా లేదా స్పష్టత ఇవ్వాలని బీసీసీఐని ప్రశ్నించాడు. రోహిత్‌ను తప్పించాలంటే సెలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సవాల్ విసిరాడు. లార్డ్స్ సెంచరీ తర్వాత కూడా రోహిత్ భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Rohit Sharma :  అతన్ని తొలగించే దమ్ము సెలెక్టర్లకు ఉందా?.. రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
Rohit Sharma

Updated on: Aug 05, 2026 | 4:24 PM

Rohit Sharma : భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంశంపై టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తనంతట తానుగా క్రికెట్ నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని, ఒకవేళ అతన్ని తొలగించాలనుకుంటే సెలెక్టర్లే ఆ పని చేయాలని నేరుగా సవాలు విసిరాడు. 2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే దానిపై బోర్డు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంపై కైఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

2027 వరల్డ్ కప్ ప్లాన్స్‌లో రోహిత్ ఉన్నాడా లేదా?

సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే ప్రశ్న అభిమానులతో పాటు విశ్లేషకులను కూడా వేధిస్తోంది. జులై 19న ఆడే మ్యాచే రోహిత్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అంటూ వచ్చిన వార్తలను బిసిసిఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ఖండించినప్పటికీ, రోహిత్ భవిష్యత్తుపై మాత్రం మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి అధికారిక హామీ లభించలేదు. దీనిపై కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ “రోహిత్‌కు నచ్చినట్లు ఆడే స్వేచ్ఛ ఇచ్చామని చెబుతున్న కోచ్‌లు, అతను 2027 వరల్డ్ కప్ ప్లాన్స్‌లో ఉన్నాడో లేదో స్పష్టంగా ఎందుకు చెప్పడం లేదు?” అని నిలదీశాడు.

లార్డ్స్ మైదానంలో నోళ్లు మూయించిన హిట్ మ్యాన్

గతంలో లార్డ్స్ మైదానంలో జులై 19న జరిగే వన్డేనే రోహిత్‌కు చివరిదని ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలను బీసీసీఐ ఖండించడమే కాకుండా, ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 84 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 138 పరుగులతో విరవిరుచుకుపడ్డాడు. ఇది అతనికి వన్డేల్లో 34వ సెంచరీ కాగా, 2026 సంవత్సరంలో తొలి సెంచరీ. భారత్ ఆ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ రోహిత్ బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. బోర్డు జోక్యం చేసుకోవడం, రోహిత్ సెంచరీ బాదడం వల్ల ఆ సమయంలో పెద్ద వివాదం తప్పిందని కైఫ్ పేర్కొన్నాడు.

సెలెక్టర్ల మధ్య ఇంకా వీడని గందరగోళం

జట్టు మేనేజ్‌మెంట్, బీసీసీఐ పబ్లిక్‌గా సరైన ప్రకటన చేయకపోవడం వల్లే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఆటగాడి ఫామ్‌లో హెచ్చుతగ్గులు సహజమని, బోర్డు రోహిత్‌కు పూర్తి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉందన్నాడు. బయట ఉన్నవారికి లోపల ఏం జరుగుతుందో పూర్తిగా తెలియకపోయినా, రోహిత్ శర్మ మాత్రం తనను ఎవరూ తప్పించలేరని, ఒకవేళ వెళ్లాలనుకుంటే ఆ నిర్ణయం తన చేతుల్లోనే ఉంచుకోవాలని భావిస్తున్నాడని కైఫ్ స్పష్టం చేశాడు.

బీసీసీఐ నిర్ణయంపైనే అందరి చూపు

రోహిత్ శర్మను వన్డే జట్టులో కొనసాగించాలా వద్దా అనే విషయమై సెలెక్టర్ల మధ్య కూడా లోపల మంతనాలు జరుగుతున్నాయని, ఇంకా ఎలాంటి ఆఖరి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. రాబోయే పర్యటనలు, సిరీస్‌ల ఆధారంగా బీసీసీఐ రోహిత్ శర్మ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us