Video: ఇదేం నాటు కొట్టుడు సామీ.. చివరి బంతికి మారిన ఫలితం.. రూ.6.50 కోట్ల ఢిల్లీ ప్లేయర్ దెబ్బకు కివీస్ విలవిల

|

Feb 21, 2024 | 6:38 PM

NZ vs AUS, 1st T20I, Mitchell Marsh: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి ఉత్కంఠభరితమైన T20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 216 పరుగులను ఛేదించి, చివరి బంతికి మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Video: ఇదేం నాటు కొట్టుడు సామీ.. చివరి బంతికి మారిన ఫలితం.. రూ.6.50 కోట్ల ఢిల్లీ ప్లేయర్ దెబ్బకు కివీస్ విలవిల
Nz Vs Aus 1st T20i
Follow us on

New Zealand vs Australia 1st T20I Result, Mitchell Marsh: ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పొరుగు దేశం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఇక్కడ మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బ్యాట్ భీకరంగా గర్జించింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో రూ. 6.50 కోట్లతో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న మార్ష్, న్యూజిలాండ్‌పై 216 పరుగుల ఛేజింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 44 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. మార్ష్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా చివరి బంతికి విజయం సాధించింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 216 పరుగులు చేసింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌కు ఓటమిని అందించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

న్యూజిలాండ్ 215 పరుగులు..

వెల్లింగ్‌టన్‌ మైదానంలో న్యూజిలాండ్‌ తరపున బ్యాటింగ్‌ ప్రారంభించిన డెవాన్‌ కాన్వాయ్‌ 46 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. కాగా మూడో స్థానంలో వచ్చిన రచిన్ రవీంద్ర 35 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 68 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది.

మార్ష్, డేవిడ్‌ల ఊచకోతతో మారిన ఫలితం..

216 పరుగుల ఛేదనలో ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా స్కోరు 69 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (24), డేవిడ్ వార్నర్ (32) శుభారంభాన్ని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. ఈ సమయంలో, మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ మిచెల్ మార్ష్ ఒక ఎండ్‌ను హ్యాండిల్ చేయగా, గ్లెన్ మాక్స్‌వెల్ (25), జోష్ ఇంగ్లిస్ (20) కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే చివర్లో, టిమ్ డేవిడ్ తన అజేయ ఇన్నింగ్స్‌తో 10 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ మార్ష్ కూడా 44 బంతుల్లో రెండు ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 216 పరుగులు చేసి తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు 6 వికెట్ల తేడాతో ఓటమి రుచి చూపించింది. చివరి బంతికి ఆస్ట్రేలియాకు నాలుగు పరుగులు అవసరం కాగా టిమ్ సౌతీ వేసిన బంతిని ఫోర్ కొట్టి టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..