
Team India 2027 World Cup Plan: భారత క్రికెట్ అభిమానులకు ఒక తీపి కబురు. టీమ్ ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు పాల్గొంటారా లేదా అన్న సందేహాలపై టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో వన్డేకు ముందు ఆయన మీడియాలో మాట్లాడుతూ, రోహిత్-కోహ్లీలు 2027 వరల్డ్ కప్ రోడ్‌మ్యాప్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు.
“రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు, వారు టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహాల్లో కీలక భాగస్వాములు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో వారు నిరంతరం వన్డే ఫార్మాట్ గురించి, ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో జరిగే 2027 వరల్డ్ కప్ ప్రణాళికల గురించి చర్చిస్తున్నారు” అని కోటక్ వెల్లడించారు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. గంభీర్ ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్న వార్తల్లో నిజం లేదని, వారు అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ అని, జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలో వారికి బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు.
2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో జరగనుంది. దక్షిణాఫ్రికాలోని బౌన్సీ పిచ్‌లపై యువ ఆటగాళ్లు తడబడే అవకాశం ఉంటుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీ, రోహిత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉంటేనే భారత్ విజయావకాశాలు మెరుగుపడతాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వారు ఆడుతున్న తీరు, చూపిస్తున్న ఫిట్‌నెస్ ప్రకారం 2027 వరకు వారు ఆడటం ఏమాత్రం కష్టం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. గత ఐదు వన్డేల్లో వరుసగా 50 కంటే ఎక్కువ పరుగులు చేసి ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సొంతం చేసుకున్నాడు. అటు రోహిత్ శర్మ కూడా వన్డేల్లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, వారిద్దరి పూర్తి ఫోకస్ ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌పైనే ఉంది. ఇది జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అని కోచ్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..