
MI vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠరేపుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ అజేయ సెంచరీతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని డికాక్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయం మొదట్లో సరైనదే అనిపించింది. పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన రెండో ఓవర్‌లోనే ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. వరుస బంతుల్లో ర్యాన్ రికెల్టన్ (2), సూర్యకుమార్ యాదవ్ (0)లను అవుట్ చేసి వాంఖడేను సైలెంట్ చేశారు. ముంబై కేవలం 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కష్టాల్లో ఉన్న ముంబైని క్వింటన్ డికాక్, నమన్ ధీర్ ఆదుకున్నారు. ముఖ్యంగా నమన్ ధీర్ 10 పరుగుల వద్ద ఉన్నప్పుడు యుజ్వేంద్ర చాహల్ ఇచ్చిన లైఫ్ లైన్ అద్భుతంగా వాడుకున్నాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నమన్ ధీర్ 31 బంతుల్లో 50 పరుగులు చేసి శశాంక్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా, డికాక్ మాత్రం ఆఖరి వరకు క్రీజులో ఉండి పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.
క్వింటన్ డికాక్ కేవలం 53 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇది ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో అతనికి రెండో సెంచరీ కావడం విశేషం. మొత్తం 112 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌లో డికాక్ 7 ఫోర్లు, 7 కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (14) మరోసారి నిరాశపరిచినా, డికాక్ జోరుతో ముంబై గౌరవప్రదమైన స్కోరును సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లతో రాణించాడు.
పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే 120 బంతుల్లో 196 పరుగులు చేయాలి. అంటే ఓవర్‌కు సగటున 9.8 పరుగులు సాధించాల్సి ఉంటుంది. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, బుమ్రా వంటి మేటి బౌలర్లను ఎదుర్కొని పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో చూడాలి. పంజాబ్ జట్టులో శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్ వంటి హిట్టర్లు ఉన్న నేపథ్యంలో సెకండ్ ఇన్నింగ్స్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..